Son fulfilled his mother wish in AP: 56 ఏళ్ల తర్వాత పుట్టింటికి చేరిందో ఓ వృద్ధురాలు. తనవారిని చూడాలన్న కోరికను తన కుమారుడు నెరవేర్చి, 56 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ఆమె తన పుట్టింటి వారిని చూసిన ఆనందానికి అవధుల్లేవు. ఆమెను చూసిన పుట్టింటి వారు ఎలా స్వాగతించారు, తరవాత ఏవిధంగా వారు స్పందించారో తెలుసుకుందాము..
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన ఎం.గౌరీపార్వతి యుక్త వయసులో ప్రేమించిన వ్యక్తితో రాష్ట్రం దాటి వెళ్లిపోయారు. 56ఏళ్ల కిందట పుట్టింటి వారికి దూరంగా వెళ్లిన ఆమె వయసు ఇప్పుడు 72ఏళ్లు. తన వాళ్లందరినీ చూడాలని ఉందని కుమారుడు షణ్ముక్‌రాజ్‌తో కొన్నాళ్ల క్రితం చెప్పారామె. తల్లి కోరిక తీర్చేందుకు ఇటీవల నర్సీపట్నం వచ్చిన అతడు బంధువులను కలిశారు.
తన వాళ్ల కోసం తల్లి ఎంతగా ఆరాటపడుతుందో వివరించారు. దీంతో పుట్టింటి వారంతా తమిళనాడు వెళ్లి గౌరీపార్వతిని చూసి వచ్చారు. 4 రోజుల కిందట గౌరీపార్వతి తన కుటుంబంతో కలిసి నర్సీపట్నంలోని పుట్టింటికి వచ్చారు. ఆమె రాకను బంధుమిత్రులంతా ఆనందంతో స్వాగతించారు. చిన్ననాటి ముచ్చట్ల నుంచి ఇన్నేళ్ల అనుభవాలను పంచుకుంటున్నారు.
తమిళనాడులోని ఎట్టాయపురం ప్రాంతానికి చెందిన నమ్మళ్వార్ ఆరు దశాబ్దాల కిందట నర్సీపట్నం ప్రాంతానికి విద్యుత్ పనుల కోసం రాగా.. గౌరీపార్వతి పరిచయమై ప్రేమగా మారింది. వీరి వివాహానికి అప్పట్లో కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో తమిళనాడు వెళ్లి పెళ్లి చేసుకున్నారు. అక్కడే స్థిరపడిపోయారు. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.