ముఖ్యమంత్రి కేసీఆర్‌కు(cm kcr) హుజూరాబాద్ ఉపఎన్నిక(huzurabad byelection) ఓటమి భయం పట్టుకుందని భాజపా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా అని విమర్శించారు. కేసీఆర్ కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆక్షేపించారు. రాయలసీమలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని.. వాటన్నింటిపై రానున్న రోజుల్లో ఉద్యమం చేస్తామని ఆయన వెల్లడించారు.
కర్నూలులో సమావేశమైన ఆ పార్టీ రాష్ట్ర నేతలు..... రాయలసీమలో నీటి ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పోలవరం మినహా రాష్ట్రంలో ప్రాజెక్టులే లేవా అని ఏపీ ప్రభుత్వాన్ని సోము వీర్రాజు ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల మాటేమిటి అని నిలదీశారు. వీటిపై త్వరలోనే ఉద్యమిస్తామని.... హెచ్చరించారు. రాత్రిళ్లు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరూ ఫోన్‌లో రహస్య మంతనాలు జరిపి.... తెల్లారితే లేఖల పర్వం మొదలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేెశంలో మాట్లాడకుండా కాలయాపన చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఏ ముఖం పెట్టుకొని 45టీఎంసీల నీళ్లు అడుగుతున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక వస్తుండటంతోనే జలవివాదాన్ని కేసీఆర్ తెరపైకి తీసుకువచ్చారు.
-సోము వీర్రాజు, భాజపా ఏపీ అధ్యక్షుడు
ప్రాజెక్టులు పూర్తి చేయాల్సింది పోయి.. వివాదాలు పెట్టుకోవటం తెలుగు రాష్ట్రాల సీఎంలకు మంచిది కాదని సోము వీర్రాజు హితవు పలికారు. జల వివాదంపై విజయవాడలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష