హైదరాబాద్ శివారులో పీరంచెరువు ప్రాంతంలో గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ గేటెడ్ కమ్యూనిటీ కొత్తగా ఏర్పాటైంది. పదెకరాల విస్తీర్ణంలో పది బహళ అంతస్తుల భవనాలు నిర్మించారు. ఇక్కడ 518 కుటుంబాల వారు నివసిస్తున్నారు. వీరి వ్యక్తిగత, ఉమ్మడి అవసరాలకు కలిపి ప్రతినెలా రూ.12 లక్షలకు పైగా విద్యుత్ బిల్లు వస్తోంది. ఈ ఖర్చు తగ్గించుకునేందుకు యజమానుల సంక్షేమ సంఘం ప్రతినిధులు తమ సంఘ కార్పస్ ఫండ్ సొమ్ముతో సౌర విద్యుత్ ప్లాంట్ పనులు ప్రారంభించారు.
ప్రతినెల 85వేల యూనిట్లు
టీఎస్‌ఎస్పీడీసీఎల్ నుంచి గేటెడ్ కమ్యూనిటీ తీసుకున్న లోడ్ 900 కిలోవాట్లు. ఇందులో 80 శాతమే సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చని డిస్కం అనుమతించింది. ఆ మేరకు 715 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌర పలకలను 8 భవనాలపై ఏర్పాటు చేశారు. మూడు నెలల్లోనే పనులు పూర్తి చేసి మే నుంచి ఉత్పత్తి ప్రారంభించారు. ప్రతినెలా 85 వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తవుతోంది. గేటెడ్ కమ్యూనిటీ వాడే మొత్తం యూనిట్ల నుంచి గ్రిడ్‌కు కలిపిన యూనిట్లను తీసేసి మిగిలిన విద్యుత్‌కు మాత్రమే బిల్లులు జారీ చేస్తున్నారు. వీరు సౌర విద్యుత్ వాడటం వల్ల ఏటా 600 టన్నుల కార్బన్-డై-ఆక్సైడ్ కాలుష్య ఉద్గారాలు వెలువడకుండా చేసినవారవుతున్నారు.
రూ.6 లక్షల విద్యుత్ బిల్లు తగ్గింది
గుజరాత్‌లో ఎక్కువగా ఇళ్లపైన సౌర విద్యుత్ ఉత్పత్తి చేయడం తమ ఆలోచనకు బీజం పడిందని సంఘం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి తెలిపారు. సొంత ఖర్చుతో ఇంత పెద్ద ఎత్తున చేయడంలో దేశంలోనే తమ గేటెడ్ కమ్యూనిటీ మొదటిదని గర్వంగా చెబుతున్నారు. ఉత్పత్తి మొదలైన మే, జూన్ చూస్తే ప్రతినెలా రూ.6 లక్షల కరెంట్ బిల్లు తగ్గిందని, ఆదా అయిన సొమ్మును తిరిగి కార్పస్ ఫండ్‌లో జమ చేస్తున్నామని వెల్లడించారు. నాలుగైదేళ్లలోనే తాము పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఒక్కో సౌర పలక ఎనిమిది చెట్లు తగ్గించగల కాలుష్యాన్ని తగ్గిస్తుంది. ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా విద్యుత్ బిల్లు ఆదా అవ్వడమే గాక.. పర్యావరణాన్ని కాలుష్య కోరల్లోంచి కాపాడగలం.
- ఇదీ చూడండి : ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో ఏపీ సీఎం భేటీ