పాలకులు అభివృద్ధి పేరుతో హైదరాబాద్‌ను నాశనం చేశారని పర్యావరణవేత్తలు, సామాజికవేత్తలు ఆరోపించారు. మహానగరం అని చెప్తున్న పాలకులు విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కొవాలనే అవగాహన, ప్రణాళిక లేకపోవడం విచారకరమన్నారు. హైదరాబాద్‌లో వర్షాల వల్ల ప్రజల ఇబ్బందులు, పాలకుల తప్పిదాలు అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి, సామాజికవేత్త సజయ, అమ్మ వేదిక వ్యవస్థాపకురాలు ఇందిర తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సరైన నగర ప్రణాళిక లేకపోవడమే నేటి దుస్థితికి కారణమన్నారు. ప్రకృతికి అనుగుణంగా పాలకులు పని చేయాలి తప్ప.. పాలకుల అలోచనలకు అనుగుణంగా ప్రకృతి పని చేయదన్నారు.
భాగ్యనగరంలో చెరువులకు అనుసంధానంగా కొండలు ఉండేవని.. ఇప్పుడవి కనిపించడం లేదన్నారు. అందుకే నగరానికి ఈ దుస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. వరదల వల్ల నష్టపోయిన పేద ప్రజలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సరైనా ప్రణాళికతో ముందుకు పోవాలని సూచించారు. ప్రభుత్వానికి నాలాల పక్కన ఉన్న పేదలు మాత్రమే కనిపిస్తారు తప్ప… చెరువులను మింగేసిన ధనికులు కనిపించరా అని ప్రశ్నించారు.