కేంద్ర ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లో నాన్‌గెజిటెడ్, క్లరికల్, నాన్‌టెక్నికల్ (గ్రూప్ బి, సి, డి కేటగిరీలు) పోస్టుల భర్తీకి జాతీయ నియామక ప్రవేశ పరీక్ష (ఎన్‌ఆర్‌ఏ)ను సెప్టెంబరులో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జాతీయ స్థాయిలో ఉద్యోగాలకు ఒకే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు బోర్డును ఏర్పాటు చేసిన కేంద్రం ఇటీవల పాలకమండలిని కూడా నియమించింది. స్వయంప్రతిపత్తితో కూడిన ఈ బోర్డుకు దిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు దేశవ్యాప్తంగా ఆరుచోట్ల ప్రాంతీయ కార్యాలయాలు ఉంటాయి.
ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, బ్యాంకు ఉద్యోగాల ఎంపిక బోర్డు (ఐబీపీఎస్) చేపట్టే నియామకాలకు వేర్వేరు ప్రవేశ పరీక్షలు జరుగుతున్నాయి. ఇకమీదట ఎన్‌ఆర్‌ఏ నిర్వహించే ఉమ్మడి పరీక్షతో ప్రిలిమినరీ పూర్తవుతుంది. అందులో మెరిట్ ఆధారంగా ఆయా నియామక సంస్థలు తదుపరి పరీక్షలు, ఎంపికలు నిర్వహిస్తాయి. ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎన్‌ఆర్‌ఏ ప్రతిపాదించినప్పటికీ, అవసరమైతే రాష్ట్రాలు ఈ స్కోరు పరిగణనలోకి తీసుకునేందుకు అవకాశముందని ఇప్పటికే కేంద్రం సూచించింది.
ఆర్థికంగా వెసులుబాటు..
దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలకు వేర్వేరు ప్రకటనలు వెలువడుతున్నాయి. రెండు, మూడు విడతల్లో పరీక్షలు జరిగాక తుది ఎంపికలు పూర్తవుతున్నాయి. ఇదంతా పూర్తికావడానికి కనీసం రెండేళ్లకు పైగా సమయం పడుతోంది. నియామక ప్రక్రియ ఆలస్యమవుతోంది. ప్రతి పరీక్ష కోసం అభ్యర్థి ప్రత్యేకంగా సన్నద్ధం కావాల్సి వస్తోంది. వేర్వేరుగా ఫీజులకు భారీగా ఖర్చుచేయాల్సి వస్తోంది. నియామక సంస్థలపైనా నిర్వహణ భారం పడుతోంది. వీటన్నింటినీ చక్కదిద్దడం కోసం ఉమ్మడి పరీక్ష విధానాన్ని తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పరీక్షతో ఏడాదిలోగా నియామకాలు పూర్తిచేసేందుకు అవకాశం కలుగుతుందని అంచనా.
ఏటా రెండుసార్లు..
ఉమ్మడి ప్రాథమిక వడపోత పరీక్షను ప్రస్తుతం ఏటా రెండుసార్లు నిర్వహించాలని డీవోపీటీ నిర్ణయించింది. ఈ ఏడాదికి తొలి పరీక్ష సెప్టెంబరులో జరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి పరీక్షలో ఉత్తీర్ణులైనవారి వివరాలు, మార్కులను నియామక విభాగాలైన ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌ఆర్‌బీ, ఇతర నియామక బోర్డులకు పంపిస్తారు. ఆ బోర్డులు మార్కుల కటాఫ్ ఆధారంగా దరఖాస్తులు ఆహ్వానించి, తుది పరీక్ష నిర్వహిస్తాయి. ఎన్‌ఆర్‌ఏతో ఉమ్మడి సిలబస్ అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం వేర్వేరు పరీక్షలకు విద్యార్హత ఒకటే అయినా, సిలబస్ వేరుగా ఉంటోంది. దేశంలోని నియామక పరీక్షలకు ఒకే విధమైన సిలబస్ ఉండాలని యూపీఎస్సీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. అది కూడా సాకారమయ్యే అవకాశముంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా ఉంటుంది. గ్రామీణ అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు డీవోపీటీ తెలిపింది. అభ్యర్థి తాను ఎంచుకున్న పరీక్ష కేంద్రలో కోరిన తేదీలో పరీక్ష రాసేందుకు అవకాశం లభిస్తుందని తెలిపింది.
- ఇదీ చదవండి : సివిల్స్ ఇంటర్వ్యూలు వాయిదా