సింగరేణి సౌర విద్యుత్, సరఫరా, వినియోగం, బిల్లింగ్, తదితర అంశాలపై తెలంగాణ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులతో ఆ సంస్థ డైరెక్టర్(ఈఎం) డి.సత్యనారాయణ రావు హైదరాబాద్ సింగరేణి భవన్లో సమావేశమయ్యారు. ట్రాన్స్‌కో సేవలను ప్రత్యక్షంగా కానీ... పరోక్షంగా కానీ... సింగరేణి వినియోగిస్తున్నందున కొన్ని ఛార్జీలను సంస్థ చెల్లించాల్సి ఉంటుందని సత్యనారాయణకు ఉన్నతాధికారులు వివరించారు. ట్రాన్స్‌కో సబ్స్టేషన్లు, లైన్ల వినియోగానికి, ఓపెన్ యాక్సెస్‌కు అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు.
సింగరేణి సోలార్ ప్లాంటు, అనుసంధానం చేయనున్న ప్రదేశాలు, సింగరేణి విద్యుత్తు అవసరాలు, ట్రాన్స్ కో ద్వారా లేదా నేరుగా సింగరేణి లైన్ల ద్వారా సోలార్ విద్యుత్ వినియోగం, బిల్లింగ్‌పై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో 350 మెగావాట్ల ఎసీ (500 మెగావాట్ల డీసీ) సామర్థ్యంతో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంటులు ఏర్పాటు చేయడానికి 3 జలాశయాలపై అధ్యయనం చేశామన్నారు.
లోయర్ మిడ్ మానేరు ప్రాజెక్టు (కరీంనగర్) సానుకూలంగా ఉంటుందని ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ రామక్రిష్ణ వివరించారు. పూర్తిస్థాయి నీరు నిండినపుడు దాదాపు 82 చదరపు కిలోమీటర్ల నీటి విస్తీర్ణం ఉండే ఈ జలాశయంలో తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు కేవలం 12.5 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం సరిపోతుందని తెలిపారు. నిర్మాణం వ్యయం, అందుకు పట్టే సమయం, నిర్మాణానికి గల అనుకూలతలు మొదలైన విషయాలపై డైరెక్టర్ డి.సత్యనారాయణ రావు లోతుగా చర్చించారు. త్వరలో సీఎండీ ఎన్. శ్రీధర్‌కు నివేదించనున్నామని.. ఆయన ఆదేశంపై తదుపరి కార్యచరణ చేపడుతామని డైరెక్టర్(ఈఎం) తెలిపారు.