ఆంధ్రప్రదేశ్లోని విశాఖ అప్పన్న.. శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏడాది అక్షయ తృతీయ నాడు వైభవంగా స్వామివారి ఉత్సవం నిర్వహిస్తారు. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహగిరిపై ఈరోజు సింహాద్రి అప్పన్నస్వామి నిజరూప దర్శనం చందనోత్సవం సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారు జామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా స్వామి వారికి ఆలయ ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ సంచిత గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. రాత్రికి వైదికవర్గాలు స్వామివారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తారు. వేదమంత్రాల నడుమ స్వామివారికి తొలి విడత చందనం సమర్పించనున్నారు.
ఏటా చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగేది. లక్షలాది మంది భక్తులు స్వామి నిజరూపాన్ని కనులారా దర్శించుకునేవారు. గత ఏడాది కరోనా కారణంగా ఏకాంతంగానే చందనోత్సవం జరిగింది. ఈసారి రెండో దశ కోరలు చాచడంతో రెండో ఏడాది కూడా భక్తులు లేకుండానే ఉత్సవం జరుగుతుంది. చరిత్రలో ఎన్నడూ ఇలా జరిగిన దాఖలాలు లేవని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. చందనోత్సవం సందర్భంగా భక్తుల పేరిట ఆలయ కల్యాణ మండపంలో జరిగే గోత్రనామ పూజలను యూట్యూబ్ ద్వారా దేవస్థానం ప్రత్యక్ష ప్రచారం చేస్తుంది.
ఇదీ చదవండి: కరోనా కోలుకున్న వారిలోనూ.. బ్లాక్ ఫంగస్