Shivaratri Celebrations: మనిషిలోని శక్తిని ఉప్పొంగించి.. ఆధ్యాత్మిక శిఖరానికి చేర్చే పర్వదినమే మహాశివరాత్రి. ఈ విశిష్ట రోజున పరమశివుడిని పూజిస్తే కుటుంబం చల్లగా ఉంటుందని భక్తజనం నమ్ముతారు. ఇదే నమ్మకంతో దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ రాజన్న సన్నిధికి భక్తజనం పోటెత్తారు. తెల్లవారుజాము 3గంటల నుంచి అర్ధనారీశ్వరుడి దర్శనానికి బారులు తీరారు. కోడెమొక్కులు చెల్లించుకుని గంగాధరుడి కరుణ పొందారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్నకు ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ పట్టువస్త్రాలు సమర్పించారు.
మహానగరంలో మహాశివరాత్రి..
హైదరాబాద్‌లో ప్రముఖ శైవక్షేత్రాలైన కీసరగుట్టలో శివరాత్రి వైభవంగా నిర్వహించారు. త్రిలోక పూజ్యుడికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డి, కేటీఆర్ సతీమణి, కుమారుడు పరమశివుడిని దర్శించుకున్నారు. బీరంగూడ మల్లిఖార్జున స్వామి ఆలయంలో తెల్లవారుజామునుంచే భక్తులు బారులు తీరారు. సూరారం, కూకట్ పల్లి, వనస్థలిపురం సహా.. మహానగరంలోని ప్రతి శివాలయం మహాదేవుడి నామస్మరణతో మార్మోగాయి.
కాళేశ్వరంలో కల్యాణం..
కాళభైరవుని భక్తులతో కాళేశ్వరం పుణ్యక్షేత్రం కిటకిటలాడింది. త్రివేణి సంగమంలో జనం పుణ్యస్నానాలు ఆచరించి... దీపదానాలు చేసి... సైకత లింగాలకు పూజలు చేశారు. కాళేశ్వర, ముక్తీశ్వర స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు చేశారు. కాళేశ్వర, నందాదేవిల కల్యాణం వైభవంగా నిర్వహించారు.
రామలింగేశ్వరునికి ఆభిషేకాలు..
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భక్తులు శివోహమంటూ నందీశ్వరుడి ఆలయాలకు పోటెత్తారు. హన్మకొండలోని సుప్రసిద్ధ వేయి స్తంభాల ఆలయంలో...రుద్రేశ్వరుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. అభిషేకప్రియుడికి పాలాభిషేకాలు చేసి తన్మయత్వం చెందారు. హన్మకొండలో మాహిమాన్విత క్షేత్రంగా పేరొందిన సిద్దేశ్వరాలయంలో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. కాజీపేట మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలోనూ మహాకాళుడి భక్తులు దర్శనాల కోసం బారులుతీరారు. జనగామ జిల్లా పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహాదేవుడి దర్శనం చేసుకున్నారు. భద్రకాళీ సమేత వీరభద్రుడిని మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. రామప్ప రామలింగేశ్వర ఆలయంలో నందీశ్వరుడి ముందు దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు. ఐనవోలు మల్లన్న ఆలయం భక్తజనంతో కిటకిటలాడింది. ఆలయంలో పెద్దపట్నం తొక్కేందుకు జనం ఎగబడ్డారు.
ఏడుపాయల జాతల ప్రారంభం..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భోళాశంకరుడి నామస్మరణతో మార్మోగాయి. ప్రసిద్ధ ఏడుపాయలు దుర్గమ్మ సన్నిధిలో నాలుగు రోజుల జాతర ప్రారంభమైంది. ప్రభుత్వం తరఫున వనదుర్గాభవానికి మంత్రి హరీశ్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత మంత్రి తలసాని సహా ప్రముఖులు తల్లిని దర్శించుకున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం కేతకీ సంగమేశ్వర ఆలయంలో మహశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి.
శివనామస్మరణతో ఆలయాలు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో...నల్లమలలోని సోమశిల, అలంపూర్ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలు.. అభిషేకాలు, అర్చనలతో ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి తీరం శివభక్తులతో కళకళలాడింది. నల్గొండ చెర్వుగట్టు జడల రామలింగేశ్వరుడిని సీఎస్ సోమేశ్ కుమార్ దర్శించుకున్నారు. కొమురవెల్లి మల్లన్న, దుబ్బ రాజన్న, గట్టు మల్లన్న ఇలా తీరొక్క పేర్లతో వెలసిన శివయ్యను భక్తులు భక్తిభావంతో కొలిచారు.
ఇదీ చూడండి: