మహిళలు, యువతులను వేధించే పోకిరీలపై పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. బాధితులు ఫిర్యాదులిచ్చిన వెంటనే రంగంలోకి దిగి వారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అవసరమైన వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. గత ఆరు నెలల కాలంలో రాచకొండ పోలీసులు 117 మంది పోకిరీలను అరెస్టు చేశారు.
పీటీ ఉపాధ్యాయుని మోసం...
నాచారం ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఉపాధ్యాయురాలిని అదే పాఠశాలలో పీఈటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంగారెడ్డికి చెందిన రామారావు జాదవ్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. పలుమార్లు పెళ్లి చేసుకోమని కోరినప్పటికీ నిరాకరించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
న్యాయవాదికి అసభ్య సందేశాలు...
మరో కేసులో మహిళా న్యాయవాదికి తనకు న్యాయపరమైన సమస్యలు ఉన్నాయంటూ... నాగర్‌కర్నూలుకు చెందిన దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి ఫోన్ చేశాడు. కొన్ని కేసులకు సంబంధించిన దస్త్రాలు పంపిస్తానంటూ... న్యాయవాది వాట్సాప్ నెంబర్ తీసుకున్నాడు. అనంతరం ఆమెకు అసభ్య సందేశాలు, ఫోటోలు పంపుతూ వేధించాడు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.
మద్యం తాగించి లైంగికదాడి...
బాలాపూర్‌కు చెందిన యువతిని అపహరించిన ముగ్గురు యువకులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి లైంగిక దాడి చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితులు సురేశ్, నితీశ్‌తో పాటు ఓ మైనర్‌ను అరెస్టు చేశారు.
బాల్య వివాహాలు అరికట్టేందుకు రాచకొండ పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా చేపడతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఆరు నెలల కాలంలో ఎనిమిది బాల్య వివాహాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 82 బాల్య వివాహాలను అడ్డుకొని... 82 మంది బాలికలను కాపాడినట్టు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో 46 గృహహింస కేసులకు సంబంధించిన ఫిర్యాదులు రాగా... వారందరికీ కౌన్సిలింగ్ నిర్వహించారు.
బాధితులు ఎవరైనా రాచకొండ వాట్సప్ నెంబర్ 9490617111 లేదా 100 నెంబర్లకు ఫోన్ చేస్తే తక్షణం స్పందిస్తామని పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు.