హైదరాబాద్‌లో గుట్టుచప్పుడు కాకుండా విదేశీ సెక్స్ రాకెట్లు కొనసాగుతున్నాయి. పని ఇప్పిస్తామంటూ బంగ్లాదేశ్‌కు చెందిన అమాయక యువతులను అక్కడున్న సెక్స్ రాకెట్ నిర్వాహకులు హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. మూడు నాలుగురోజుల తర్వాత పనులు లేవంటూ వారిని బలవంతంగా పడుపు వృత్తిలోకి దింపుతున్నారు. స్వీయ నిఘాతో హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. నెలరోజుల్లో ఛత్రినాక, మొఘల్‌పురా పోలీస్ ఠాణాల పరిధిలో సెక్స్‌రాకెట్ నిర్వహిస్తున్న రెండు ముఠాలను అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి యువతులను తరలిస్తున్న సీమా బెహ్రా, రాజేష్ దేవనాథ్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అమిన్‌ధాలి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బంగ్లాదేశ్ నుంచి యువతుల లైంగిక అక్రమ రవాణాపై హైదరాబాద్ పోలీసుల ద్వారా సమాచారం తెలుసుకున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఎ) తొలికేసు నమోదు చేసింది. ఉగ్రకోణం ఏదైనా ఉందా? అన్న అనుమానంతో ఎన్.ఐ.ఎ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సరిహద్దు దాటేసి.. హౌరా ఎక్కేసి
సీమా బెహ్రా, రాజేష్ దేవనాథ్, రషీద్ అలీలు బంగ్లాదేశ్ వెళ్లి.. హైదరాబాద్ నగరంలో పనులు ఎక్కువగా ఉంటాయని, ఉచిత వసతి సౌకర్యంతో పాటు మంచి జీతం ఇస్తామంటూ యువతులను నమ్మిస్తున్నారు. వారు అంగీకరించిన అనంతరం ఐదారుగురు యువతులతో మాల్డా వద్ద సరిహద్దు దాటేస్తున్నారు. అక్కడి నుంచి హౌరా ఎక్స్‌ప్రెస్ రైలెక్కి హైదరాబాద్‌కు వస్తున్నట్లు మొఘల్‌పురా పోలీసుల దర్యాప్తులో తేలింది.
రోజుకు రూ.200లు..
పనిప్పిస్తామంటూ హైదరాబాద్‌కు తీసుకువచ్చిన యువతులకు రెండు, మూడు రోజులపాటు మంచి భోజనం పెట్టించాక ఇక్కడ పనులు దొరకడం లేదని, డబ్బు సంపాదించాలంటే పడుపువృత్తిలోకి దిగాలంటూ వారిని బలవంతం చేస్తున్నారు. ఇంటికి తిరిగి వెళ్లలేని అసహాయస్థితిలో యువతులు సెక్స్‌రాకెట్ నిర్వాహకులు చెప్పినట్టు చేస్తున్నారు. ఉచితంగా వసతి, భోజనం పెడుతున్నాం... ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేం. ఎదురు మాట్లాడితే మేమే పోలీసులకు సమాచారం ఇస్తామంటూ బెదిరిస్తున్నారని బాధిత యువతి మొఘల్‌పురా పోలీసులకు తెలిపింది. ఇప్పటి వరకూ 9 మంది యువతులను సెక్స్‌రాకెట్ నిర్వాహకుల బారి నుంచి కాపాడి రక్షిత గృహాలకు తరలించామని మొఘల్‌పురా పోలీస్ ఠాణా ఇన్‌స్పెక్టర్ రవికుమార్, అదనపు ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ గౌడ్‌లు తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం కేసును ప్రత్యేక పరిశోధన బృందం(సిట్) బదిలీ చేశారు.