స్వస్తిక్ కాకుండా ఇతర ముద్రలతో నమోదైన ఓట్లపై సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలన్న రాష్ట్ర ఎన్నికల సంఘం అప్పీల్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. అభ్యర్థి మెజారిటీ కన్నా ఇతర ముద్రలతో ఉన్న బ్యాలెట్ పత్రాలు ఎక్కువగా ఉంటే ఫలితం నిలిపివేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్ రెడ్డి శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అప్పీల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది.
ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు..
ఓటరుకు ఉద్దేశం స్పష్టంగా ఉన్నప్పుడు ఇతర గుర్తులను కూడా అంగీకరించేందుకు చట్టం అంగీకరిస్తోందని ఎస్ఈసీ తరఫు న్యాయవాది వాదించారు. అయితే లెక్కింపు ప్రక్రియ కూడా పూర్తయిందని.. మరోవైపు సింగిల్ జడ్జి వద్ద సోమవారం నాడే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు ఆదేశాలతో నేరేడ్మెట్లో ఓట్లు లెక్కించినప్పటికీ ఫలితం వెల్లడించలేదని.. అక్కడ తెరాస అభ్యర్థికి 505 ఓట్ల మెజారిటీ ఉండగా.. ఇతర ముద్రలతో 544 ఓట్లు నమోదయ్యాయని వివరించారు. ఒక స్థానంలోనే నిలిచిపోయినందున.. రెండు రోజులు ఆగితే ఇబ్బందేమి ఉందని ధర్మాసనం పేర్కొంది.
మొదట దీనిపై విచారణ
పోలింగ్ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వక పోవడం వల్లే ఈ గందరగోళం ఏర్పడిందని ధర్మాసనం అభిప్రాయపడింది. మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోమని.. సింగిల్ జడ్జి వద్ద విచారణ పూర్తయ్యాక అప్పటికీ అభ్యంతరాలుంటే రావచ్చునని తెలిపింది. ఎల్లుండి ఉదయం మొట్ట మొదట ఈ వివాదంపైనే విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ధర్మాసనం ఆదేశిస్తూ.. అప్పీల్‌పై విచారణ ముగించింది.