Seasonal diseases : హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు లక్షణాలతో ఎక్కువ మంది వస్తున్నారు. కొద్దిరోజులుగా ఇక్కడ ఓపీ రోజుకు 600కు పైగా నమోదవుతోంది. గత 4 వారాలుగా డెంగీ విజృంభిస్తోందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,165 డెంగీ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 504, రంగారెడ్డిలో 96, కరీంనగర్‌లో 80, ఆదిలాబాద్‌లో 57, మహబూబ్‌నగర్‌లో 54, మేడ్చల్ మల్కాజిగిరిలో 54, పెద్దపల్లిలో 40 డెంగీ పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.
ఈ ఏడాది ఇప్పటివరకూ 203 మలేరియా కేసులు నమోదు కాగా.. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 115, ములుగులో 43 నిర్ధారించారు. గన్యా కేసులు 40 నమోదవగా.. అందులో 39 ఖమ్మంలోనే రావడం గమనార్హం. దోమల సంహారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే.. మున్ముందు జ్వరాల కేసులు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది.
అప్రమత్తత అవసరం.. "వర్షాల సమయంలో ప్రధానంగా తాగునీరు కలుషితమయ్యే అవకాశాలెక్కువ. ప్రజలు సాధ్యమైనంత వరకూ వేడిచేసి చల్లార్చిన నీటినే తాగాలి. ముఖ్యంగా శరీరంపై గాయాలకు వరదనీరు తాకితే.. వెంటనే సబ్బుతో శుభ్రపర్చి, చికిత్స అందించాలి. చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. విద్యుత్ తీగలు, ఉపకరణాలను పక్కకు జరపాల్సి వచ్చినప్పుడు.. ముందుగా విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. భవనాల్లో పగుళ్లు, నీరు కారడం వంటివి కనిపిస్తే అప్రమత్తమవ్వాలి. ఇళ్లలో పాత సామాన్లు, నీళ్ల డ్రమ్ములు, వాడిపడేసిన టైర్లు, కూలర్లు.. తదితరాల్లో, పరిసరాల్లో నీరు నిలిచి ఉండకుండా జాగ్రత్తపడాలి. నిల్వ నీటిపై తరచూ దోమల మందు పిచికారీ చేయాలి. ఇళ్లలో దోమతెరలు, దోమల సంహారిణులు వాడాలి. కొవిడ్ నిబంధనలు కొనసాగించాలి. మాస్కు ధరించడంతో కొవిడ్‌తో పాటు కాలానుగుణ వ్యాధుల నుంచి సైతం రక్షణ పొందవచ్చు." - డాక్టర్ జి.శ్రీనివాసరావు, ప్రజారోగ్య సంచాలకుడు
అవసరమైతే తప్ప బయటకు రావద్దు.. "వాతావరణం చల్లబడడంతో బ్యాక్టీరియా, వైరస్‌లు విజృంభించడానికి అన్నివిధాల అనుకూల కాలమిది. జలుబు, దగ్గు, గొంతునొప్పి, నిమోనియా, డెంగీ, డయేరియా, టైఫాయిడ్ తదితర సమస్యలతో బాధపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లల్లో వీటి తీవ్రత అధికంగా ఉంటుంది. తాగునీటి పైపులైన్లు పగిలి, మురుగునీటితో కలిసే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఇలాంటప్పుడు మలం, రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్‌లు తాగునీటిలోకి చేరిపోతాయి. ఫలితంగా ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం పడుతుంది. అవసరముంటే తప్ప బయటకు వెళ్లొద్దు. వర్షంలో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిది. జ్వరం, జలుబు, దగ్గు సమస్యలు మూడు రోజులైనా తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించాలి." - డాక్టర్ శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్