రాష్ట్రంలో జ్వరాలు(Viral Fevers in Telangana) విజృంభిస్తున్నాయి. కరోనా కాస్త నెమ్మదించగా ఒకవైపు డెంగీ, మలేరియా.. ఇంకోవైపు సాధారణ వైరల్ జ్వరాల వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. గత 6 వారాల్లోనే ఆరోగ్యశాఖ 1.62 లక్షల మంది జ్వర బాధితులను(Viral Fevers in Telangana) గుర్తించింది. ఇందులో అత్యధికంగా హైదరాబాద్‌లో 42 వేలు, రంగారెడ్డి జిల్లాలో 24 వేలమంది బాధితులున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేలో ఈ గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. బాధితుల్లో కరోనా అని నిర్ధారణ కాకపోయినా.. వీరందరికీ కొవిడ్ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ సర్వేతో సంబంధం లేకుండా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినవారిని పరిగణనలోకి తీసుకుంటే.. జ్వరాలు సోకినవారు మరో లక్ష మంది వరకూ ఉంటారని ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాదిలో జనవరి నుంచి ఇప్పటి వరకూ మొత్తంగా 13 లక్షలమందికి పైగా జ్వర పీడితులను ఇంటింటి సర్వే ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ గుర్తించడం గమనార్హం.
ఈ ఏడాది ఇప్పటి వరకూ 5,000కు పైగా డెంగీ కేసులు(Dengue cases in Telangana) నమోదయ్యాయి. గత మూడు నెలల్లో వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంది. జ్వరాలు అధికంగా హైదరాబాద్‌లో నమోదవుతుండగా.. మలేరియా కేసులు భద్రాద్రి కొత్తగూడెంలో నిర్ధారణ అవుతున్నాయి. సాధారణ వైరల్ జ్వరాలూ విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలకు ఏ జ్వరమో అర్థంకాక ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. 10 ఏళ్ల లోపు చిన్నారులు ఎక్కువగా వీటి బారినపడుతున్నారు. సాధారణంగా ఆగస్టు నుంచి నవంబరు వరకూ ఈ తరహాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తుంటాయని, మరో నెలపాటు ఇవే పరిస్థితులు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.
జ్వరంపై నిర్లక్ష్యం వద్దు
జ్వరమొస్తే(Viral Fevers in Telangana) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాల మీదకు వస్తుందని వైద్యశాఖ హెచ్చరిస్తోంది. జ్వర లక్షణాలు(Fever symptoms) కనిపిస్తే.. వెంటనే కొవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తోంది. అదేవిధంగా ప్రజలంతా కచ్చితంగా మాస్కు ధరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- ఇదీ చదవండి : వీడియో తీస్తున్నప్పుడు తెలియదు ఆమెకు.. ఇదే చివరిదని!