కరోనా వ్యాప్తి వల్ల ఈ ఏడు మండు వేసవి అంతా బడి నిర్వహించాల్సిందే. పలు సమస్యలతో పాఠశాలలను నడపడం ఎలా అన్న ప్రశ్న ఉపాధ్యాయులను కలవరపెడుతోంది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 7,986 ఉన్నాయి. అందులో సగం పాఠశాలల గదుల్లో ఫ్యాన్లు లేవు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 80-90 శాతం తరగతి గదుల్లో ఫ్యాన్లు లేవని ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ చెప్పారు. ఫ్యాన్లు లేకుంటే మే నెలలో బోధన, పరీక్షల నిర్వహణ కష్టమవుతుందన్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడి జిల్లాల్లో పెద్ద సమస్య లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాన్లు లేని గదులు ఎక్కువగా ఉంటాయని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పాఠశాల రూ.10 వేల నుంచి 25 వేల వరకు విద్యుత్తు బిల్లులు బకాయిలు పడ్డాయి. వీటిని చెల్లిద్దామంటే స్కూల్ గ్రాంట్ 25 శాతమే విడుదల చేశారు. ‘మా పాఠశాలకు రూ.20 వేల బకాయి ఉంది. కనెక్షన్ కట్ చేస్తామన్న అధికారులు కొంత సొమ్ము చెల్లించేసరికి వెనక్కి తగ్గారు’ అని మేడ్చల్ జిల్లాలో ఓ ప్రధానోపాధ్యాయుడు వాపోయారు. మరోవైపు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని జోగులాంబ గద్వాల లాంటి జిల్లాల్లో డీఈఓలు ఆదేశిస్తున్నారని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజా భానుచంద్ర ప్రకాశ్ తెలిపారు. ఆ జిల్లాలో 32 పాఠశాలలకు సంబంధించి రూ.7.73 లక్షలు బకాయిలున్నాయి.
సిలబస్ పూర్తయ్యేది ఎలా :
ఇప్పటికే పూర్తి రోజులు పాఠశాలలు నిర్వహించినా సిలబస్ పూర్తవుతుందా అన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో ఉంది. ఈ క్రమంలో ఒంటిపూట బడులు పెడితే మరింత కష్టమన్నది వారి అభిప్రాయం. విద్యార్థులు అధికంగా ఉన్న, తరగతి గదుల కొరత ఉన్న పాఠశాలల్లో షిఫ్టు విధానంలో ఉదయం, మధ్యాహ్నం తరగతులు జరుపుకోవాలని విద్యాశాఖ సూచించింది. అలాంటి పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 1500 వరకు ఉంటాయని అంచనా. షిఫ్టు విధానంలో తరగతులు నిర్వహిస్తామని ప్రధానోపాధ్యాయులు అధికారులకు దరఖాస్తు చేసినా ఇప్పటివరకు కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా పాఠశాల పర్యవేక్షణ కమిటీలు అనుమతి ఇవ్వకపోవడంతో పలుచోట్ల అయోమయం నెలకొంది. మే నెలాఖరు వరకు బడులు జరగనున్నందున పాఠశాల విద్యాశాఖకు ప్రత్యేక కార్యాచరణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. కరెంట్ బకాయిలకు నిధులివ్వడం, ఫ్యా న్లు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్య లు తీసుకోవడం లాంటి వాటిపై ప్రణాళిక రూపొందించాలని కోరుతున్నారు.