School Dropouts Increased in Telangana : రాష్ట్రంలో పాఠశాల విద్య దాటకుండానే అనేక మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారు. కేవలం తొమ్మిది, పది తరగతుల్లోనే సగటున 12.29 శాతం మంది విద్యకు దూరమవుతున్నారు. కొన్ని జిల్లాల్లో ఈ శాతం భారీగా ఉండటం గమనార్హం. రాష్ట్ర అర్థ గణాంకశాఖ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. కాకపోతే 1-5 తరగతుల్లో డ్రాపౌట్ శాతం సున్నాగా ఉండటం విశేషం. ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ(యూడైస్) 2019-20 గణాంకాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. నిపుణులేమో కరోనా తర్వాత డ్రాపౌట్లు భారీగా పెరిగాయని, 2021-22 విద్యాసంవత్సరం లెక్కలు బయటకొస్తే అది తేటతెల్లమవుతుందని చెబుతున్నారు.
గణాంకాల్లో తేడాలు!
School Dropouts in Telangana : యూడైస్ 2019-20 ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. పాఠశాల విద్యాశాఖలోని సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు 1-12 తరగతుల గణాంకాలు సేకరిస్తారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలతో పాటు పలు ప్రైవేట్ కళాశాలలు గణాంకాలను ఇచ్చేందుకు ఇష్టపడవు. అందుకే 1-12 తరగతుల విద్యార్థుల సంఖ్య 60.06 లక్షలుగా చూపారు. వాస్తవానికి 1-10 తరగతుల విద్యార్థులు 58-59 లక్షలు.. ఇంటర్ రెండేళ్ల విద్యార్థులు సుమారు 9.50 లక్షల మంది ఉంటారు. అంటే రాష్ట్రంలో కనీసం 68 లక్షలు ఉండాలి. రాష్ట్రంలో 1500లకు పైగా ప్రైవేట్, 405 ప్రభుత్వ, వందల్లో ఇతర గురుకుల జూనియర్ కళాశాలలు ఉండగా 754 కళాశాలల్నే చూపడం గమనార్హం. వాటిలో 4.06 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నట్లు చూపారు. అంటే సగం మంది లెక్కల్లోకి రాలేదు. ములుగు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా ఒక్కో బడికి (ప్రభుత్వ, ప్రైవేట్ కలిపి) 1-12 తరగతులకు సగటున 71 మంది విద్యార్థులు ఉన్నారు. అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో ఆ సంఖ్య 315గా ఉంది. రాష్ట్రంలో సగటున ఒక్కో పాఠశాలకు 147 మంది పిల్లలున్నారు.
మొత్తంగా డ్రాపౌట్లు 31.14 శాతం!
School Dropouts Before Tenth Class : రాష్ట్రంలో పదో తరగతి పూర్తయ్యేలోపే ఏకంగా 31.14 శాతం మంది విద్యార్థులు చదువు మానేస్తున్నట్లు 2021 ఆగస్టులో విడుదలైన యూడైస్ 2019-20 గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎస్టీ విద్యార్థులైతే 57 శాతం మంది మధ్యలోనే బడికి దూరమవుతున్నారు. అయిదో తరగతి పూర్తయ్యేలోపు ఆ వర్గం విద్యార్థులు వందకు 28 మంది బడి మానేస్తున్నారు. డ్రాపౌట్ శాతం ఎస్సీల్లో 32.61 శాతం ఉన్నట్లు చూపింది. తాజాగా అర్థ గణాంకశాఖ ప్రాథమిక, ప్రాథమికోన్నత, 9, 10 తరగతులను వేర్వేరుగా చూపిందని, అందుకే తక్కువ ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా తర్వాత డ్రాపౌట్ శాతం భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేస్తున్నారు.
7 జిల్లాల్లో సుమారు 20 శాతం..
మొత్తం 33 జిల్లాల్లో 9, 10 తరగతుల్లో సగటున 12.29 శాతం మంది చదువు మానేస్తుండగా.. ఏడు జిల్లాల్లో అది 20 శాతానికిపైగా ఉంది. ఆదిలాబాద్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో డ్రాపౌట్ శాతం సున్నా. 1-5 తరగతుల్లోనూ జయశంకర్ జిల్లాలో అత్యధికంగా 5.16, ఆ తర్వాత వరంగల్‌లో 4.68, నల్గొండలో 4.21 శాతం మంది చదువు మానుకుంటున్నారు. ప్రాథమిక తరగతుల సగటును పరిగణిస్తూ రాష్ట్రంలో 1-5 తరగతుల డ్రాపౌట్ శాతం సున్నాగా చూపారు.
