Fake Certificates in Telangana Health Department : ఎంపీహెచ్‌ఏ పోస్టుకు శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సు లేదా మల్టీపర్పస్ హెల్త్‌వర్కర్ కోర్సు చేసి ఉండాలి. పరీక్షల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన బోర్డు ఆఫ్ ఎగ్జామినర్ పర్యవేక్షణలో జరగాలి. 1990 తర్వాత ప్రభుత్వ వైద్యంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కోర్సును నిర్వహించడం లేదు. ఆ తర్వాత వచ్చిన వారందరూ ప్రైవేటులో ఎంపీహెచ్‌ఏ కోర్సు చేసిన వారే. ఎక్కువ మంది విశాఖపట్నం, ఒంగోలు నుంచే కాకుండా దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ధ్రువపత్రాలను తెచ్చుకున్నారు అవి సరైనవా? కావా? అని అప్పటి పారామెడికల్ బోర్డు పరిశీలించకుండా నమోదు చేసుకుంది. దీన్ని పరిగణనలోకి తీసుకునే 1999-2002 మధ్య ఎక్కువమంది ఎంపీహెచ్‌ఏలుగా ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు పొందారు. వీరికి ప్రభుత్వం నెలకు రూ.29వేలు చెల్లిస్తోంది.
తెలంగాణ ఏర్పాటయ్యాక వారిని శాశ్వత ప్రాతిపదికన నియమించే క్రమంలో ధ్రువపత్రాలను అధికారులు పరిశీలించినప్పుడు నిజం బయటపడింది. వాటిల్లో ఎక్కడా ప్రభుత్వ అధికారి సంతకం, సీల్ లేకపోవడం గమనార్హం. ఆ ధ్రువపత్రాలు జారీచేసిన ఏ సంస్థకూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన బోర్డు ఆఫ్ ఎగ్జామినర్ అనుమతి లేదని తేలింది. బోర్డు పర్యవేక్షణ లేకుండానే ఆయా ప్రైవేటు సంస్థలు సొంతంగా పరీక్షలు నిర్వహించుకుంటున్నాయనే అనుమానాలు బలపడ్డాయి. ఉద్యోగాలు పొందిన 1,076 మందిలో 274 మందే ప్రభుత్వం అనుమతించిన సంస్థలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారని ఆరోగ్యశాఖ గుర్తించింది. మిగిలిన 802 ధ్రువపత్రాల్లో అసలువెన్నో తేల్చడంపై ఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది.
Hyderabad News : ఎంపీహెచ్‌ఏ కోర్సుకు ఇంటర్ అర్హతగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అయితే కొందరు పదోతరగతి అర్హతతోనే ఈ కోర్సును పూర్తి చేసి ఉద్యోగంలో చేరారని ఆరోపిస్తూ.. పలువురు ఇదే విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ కేసు ఇప్పటికీ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని వైద్యవర్గాలు తెలిపాయి. పూర్తి చేసిన కోర్సు అర్హమైనదా? కాదా? అనే పరిశీలనకు రాకుండా.. కేవలం పదోతరగతి, ఇంటర్ అనే అంశాలపై కావాలని దృష్టి మళ్లించినట్లుగా ఆరోగ్యశాఖ అధికారులు భావిస్తున్నారు.
ప్రధానంగా నాలుగు సంస్థల నుంచి ధ్రువపత్రాలను తెచ్చుకున్నారు. వాటికి ఆయా ప్రభుత్వాల నుంచి అనుమతి ఉందా? ఎంతకాలం శిక్షణ ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి? సంవత్సరాల వారీగా ఎంతమందికి శిక్షణ ఇవ్వాలని ఉంది? ఎంతమందికి ఇచ్చారు? ఇలా పలు రకాల సందేహాలను రానీయకుండా తొక్కిపెట్టడం వెనుక పెద్ద కుంభకోణమే దాగి ఉందని ఆరోగ్యశాఖ భావిస్తోంది. ఒక సంస్థకు ఏడాదికి 50 సీట్లకు అనుమతి ఉండగా.. ఆ సంస్థల నుంచి ఏడాదిలో సుమారు 500కు పైగా ధ్రువపత్రాలు వెలువడడం అక్రమాలకు సాక్ష్యంగా వైద్యశాఖ భావిస్తోంది. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.