కేంద్ర ప్రాయోజిత పథకాల విషయంలో రాష్ట్రాలకు కేంద్రం కఠిన నిబంధనలు విధించడంతో, ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి ఓవర్ డ్రాఫ్టు రూపంలో వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమలుకు ఏకైక నోడల్ ఖాతాలు బ్యాంకులో తెరుస్తున్నందున కేంద్రం ఇచ్చే మొత్తాన్ని ఆసరాగా చేసుకుని.. ఆ మేరకు ఓవర్ డ్రాఫ్ట్ వెసులుబాటు ఇవ్వాలని ఏపీ ఆర్థికశాఖ కోరుతోంది.
ఏపీ ప్రభుత్వం అడిగిన రూ.6,500 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ ఇవ్వడం సాధ్యం కాదని ఈ పథకాలకు సింగిల్ నోడల్ ఏజన్సీగా ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా(sbi rejected od facility for 6500 crores requested by state government) కుండ బద్దలు కొట్టింది. ఈ మేరకు ఏపీ ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శికి ఎస్‌బీఐ తాజాగా లేఖ రాసింది. ‘కేంద్ర ప్రాయోజిత పథకాల సింగిల్ నోడల్ ఖాతాలు మీ బ్యాంకులో తెరుస్తాం. ఈ పథకాలకు అవసరమైన మూలధన పెట్టుబడి రూ.6,500 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ రూపంలో కల్పించాలి.
ఈ పథకాల అమలుకు ఏర్పాటుచేసిన అయిదు ఏజన్సీలకు ఆ నిధులు ఓడీగా వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. ఆ ఖాతాల్లో వినియోగించుకోగా మిగిలిన నిధులను సెక్యూరిటీగా భావిస్తూ ఈ మేరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పించాలి’ అంటూ రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి సెప్టెంబరు 2న ఎస్‌బీఐ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. వారు ఆ లేఖను పరిశీలించిన తర్వాత అలా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. బ్యాంకు నిబంధనలు ఇందుకు అనుమతించబోవని తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం సొంతంగా ఏర్పాటుచేసిన కార్పొరేషన్లకు ఇలా ఓడీ సౌకర్యం కల్పించే అవకాశం లేదన్నారు. నోడల్ ఖాతాలు తెరిచేందుకు ఖజానాతో సంబంధం ఉన్న గుంటూరు, విజయవాడల్లోని ఏ బ్యాంకు శాఖనైనా సంప్రదించవచ్చని తెలిపారు. ఓడీ వెసులుబాటు అనుసంధానంతో ఏ మాత్రం సంబంధం లేకుండానేఈ ఖాతాలు తెరవాలని ఎస్‌బీఐ సూచించింది.
ఇప్పుడేం చేయాలి?
కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నిబంధనలు మార్చింది. ఇన్నాళ్లూ కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను కొన్ని రాష్ట్రాలు తమ ఇతర అవసరాలకు వినియోగించుకోవడంతో ఈ సంవత్సరం నుంచి బిగింపు మొదలుపెట్టింది. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులూ పీడీ ఖాతాలకు మళ్లించకూడదని నిబంధన విధించింది. కేంద్రప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు తన వాటా నిధులను రాష్ట్ర ప్రభుత్వాలకు విడుదల చేస్తుంది.
రిజర్వు బ్యాంకులో ఉండే రాష్ట్రాల ఖాతాలకు అవి చేరతాయి. ఈ నిధులు చేరిన 21 రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మొత్తాన్ని సింగిల్ నోడల్ ఏజన్సీ ఖాతాలకు బదలాయించాలి. కేంద్రం తన వాటా విడుదల చేసిన 40 రోజుల్లోగా రాష్ట్రం తన వాటా నిధులను ఆ ఖాతాల్లో వేయాలి. ఒక పథకం నిధులన్నీ ఒకే బ్యాంకులో ఉండాలని, వాటి వినియోగం, ఖర్చుపై మ్యాపింగ్ చేయాలని కేంద్రం నిర్దేశించింది. నిర్దిష్ట సమయంలో కేంద్ర, రాష్ట్ర వాటాల నిధులు కలిపి ఖర్చుచేస్తేనే తదుపరి విడత నిధులు విడుదలయ్యేలా విధానాలు మార్చేసింది. రాష్ట్ర వాటా నిధులు భరించేందుకు ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూసే క్రమంలోనే రూ.6,500 కోట్ల ఓడీ సౌకర్యం కావాలని ఎస్‌బీఐకి లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో అధికారులు ఆలోచనలో పడ్డారు.
ఇదీ చదవండి: