దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిన్న వయసులో చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రామ లింగారెడ్డి వివాదరహితుడని చెప్పుకొచ్చారు. ఎన్నో సందర్భాల్లో మంత్రి హరీశ్ రావును... తాను విమర్శించిన్నపుడు వద్దు జగ్గన్న అని చెప్పేవాడని గుర్తు చేసుకున్నారు. ఆరునెలల కింద అసెంబ్లీ సమావేశంలో హరీశ్ తో సమన్వయం చేసి కూర్చోబెట్టింది కూడా రామలింగారెడ్డినేనని తెలిపారు.
2004 నుంచి వేరే వేరే పార్టీలైనా... సత్సంబంధాలు ఉండేవి పేర్కొన్నారు. రామలింగారెడ్డి నైతిక విలువలు ఉన్న నాయకుడని కొనియాడారు. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించి ఒక నాయకుడిగా ఎదిగాడన్నారు. ఉపఎన్నికలు రావడం ఖాయమని... ఆయన భార్యకే టికెట్ ఇవ్వాలని సూచించారు. ఉపఎన్నికల ఏకగ్రీవం కావడానికి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో, ఇతర నాయకులతో మాట్లాడి ఒప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు.