గురుపౌర్ణమి అంటే ఏమిటి
గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును గురు పూర్ణిమ లేదా వ్యాసపూర్ణిమ అంటారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురుపూర్ణిమ జరుపుకుంటారు. ఆరోజున గురువులను సత్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. గురుపౌర్ణమి అనగానే సాయిబాబాకు ప్రీతిపాత్రమైన రోజని భావిస్తారు. అందుకే ఆ రోజు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తుంటారు.
వ్యాసుడి పుట్టిన రోజు.. బాబాది కాదు
గురు పౌర్ణమి అనగానే సాయిబాబా పుట్టిన రోజని అనుకుంటారు. కానీ వ్యాస మహర్షి పుట్టిన రోజుని గురుపౌర్ణమిగా జరుపుకుంటాము. సాయిబాబా బతికున్న రోజుల్లో అంటే 1906లో ఆషాఢ మాసంలో వచ్చిన పూర్ణిమనాడు బాబా తన భక్తుడైన కేల్కర్ను పిలిచి నేడు గురువుల పండుగ గురువును పూజించాలని మిగతా భక్తులను తీసుకురమ్మని చెబుతాడు. అందరూ పూజా సామగ్రితో వస్తారు. కానీ ఎవరిని పూజించాలో తెలియక మిన్నకుండిపోతారు. ధ్యానంలో ఉన్న బాబా కనులు తెరిచి మీరంతా నన్ను దేవుడిగా భావిస్తున్నారు. కానీ నేను దేవుడికి సేవకుడిని మాత్రమే, మీరంతా నా బిడ్డలు, మిమ్మల్ని సక్రమమైన మార్గంలో నడిపేందుకే ఈ భూమిమీదకొచ్చానని సెలవిస్తాడు. ఏటా ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిరోజున తనను గురువుగా పూజించి మంచి మార్గంలో నడవమని బాబా చెప్పాడట. నాటి నుంచి బాబా ఆలయాల్లో వ్యాసపూర్ణిమ నాడు గురుపూర్ణిమ ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.
ఎక్కడ ఎలా చేస్తున్నారు
గురుపౌర్ణమి విశిష్టత దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొందరు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఏ విధంగా ఆచరించాలి
గురువుల పట్ల గౌరవం అన్నివేళలా పాటిస్తున్నా ఈ రోజు వ్యాసుడి పుట్టినరోజు కనుక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పర్వదినాన కొన్ని ఆలయాల్లో ఓ పూజ జరుగుతుంది. కొత్త అంగవస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి, ఆ బియ్యం చుట్టూ నిమ్మకాయలు పెడతారు. వాటిని ఆదిశంకరులు, ఆయన నలుగురు శిష్యులు వచ్చి వాటిని అందుకుంటారని విశ్వాసం. పూజ తర్వాత తలా ఓ పిడికెడు బియ్యం తీసుకుని తమ ఇళ్లలోని బియ్యంలో కలుపుకుంటారు. బియ్యం, కొత్తవస్త్రం అనేవి లక్ష్మీదేవి చిహ్నాలని, నిమ్మకాయలు కార్యసిద్ధికి సూచికలంటారు. గురుపౌర్ణమి రోజు పూజ చేసేటప్పుడు కుంకుమ, విభూతి నుదుట ధరించాలి. సాయంత్రం ఆలయంలో ఆవునేతితో దీపాలు వెలిగిస్తే సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.
ఇవీ చూడండి: పాము దాహం తీర్చిన పోలీస్