రాష్ట్రవ్యాప్తంగా వానాకాలం సీజన్‌కు సంబంధించి తొమ్మిదో విడత రైతుబంధు నగదు పంపిణీ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు 68లక్షల 94వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో.. కోటి 51 లక్షల 11 వేల ఎకరాలకు సంబంధించిన 7 వేల 654 కోట్ల రూపాయలు జమ చేయనున్నారు.
తొలి రోజు ఎకరాలోపు పొలం ఉన్న 19లక్షల 98వేల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 586 కోట్లు జమ అవుతున్నాయి. గతంలో మాదిరిగానే రోజుకో ఎకరా చొప్పున పెంచుతూ 10రోజుల పాటు పంపిణీ ప్రక్రియ కొనసాగించనున్నారు. ఈ సారి కొత్త లబ్ధిదారులకు అవకాశం ఇవ్వడంతో సాయం అందించే వారి సంఖ్య పెరిగింది.
మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని ప్రభుత్వం సూచించింది. రైతు పేరు, గ్రామం, పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు శాఖ, ఖాతా నంబరు వంటి వివరాలు అందించి నమోదు చేసుకోవాలని సూచించారు.