Rythu Bandhu Scheme : ఐదెకరాలకు పైబడి భూమి ఉన్న రైతులకు మంగళవారం నుంచి రైతుబంధు నిధులను జమచేయనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వానాకాలం రైతుబంధు నిధుల విడుదలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శి రోనాల్డ్ రోస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.
ఇప్పటి వరకు నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న 51.99 లక్షల మంది రైతులకు 3వేల 946 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. 78 లక్షల 93వేల 413 ఎకరాలకు సంబంధించి రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైతుల ఖాతాల్లో రైతుబంధు మొత్తం జమయ్యేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆర్థికశాఖ అధికారులను హరీశ్‌రావు ఆదేశించారు. అర్హులైన ప్రతి రైతుకు సకాలంలో నిధులు అందేలా చూడాలని సూచించారు.
ఇదీ చూడండి: 'రైతుబంధు లబ్దిదారుల్లో 5 ఎకరాలు ఉన్నవారే 92.50 శాతం'