హైదరాబాద్ మహానగరంలో మహాగణపతి ఉత్సవాలు షురూ అయ్యాయి. గతేడాది కరోనాతో ఉత్సవాలు జరపకపోవడం వల్ల ఈ ఏడు రెట్టింపు ఉత్సాహంతో సంబురాలు చేసుకునేందుకు నగరవాసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే గణనాథులు మండపాలకు చేరుకున్నారు. విఘ్నేశ్వరుడి పూజకు అవసరమయ్యే సామగ్రి కొనుగోళ్లలో భక్తులు నిమగ్నమయ్యారు. కొనుగోలుదారులతో నగరంలోని పలు మార్కెట్లు (Rush at markets in Hyderabad) కిటకిటలాడుతున్నాయి.
ఎంజే మార్కెట్ వద్ద ఉదయం నుంచి రద్దీగా ఉంది. వినాయకచవితి పర్వదినం సందర్భంగా.. పూలు, పూజా సామగ్రి, పత్రి, ఎలక్కాయలు, మొక్క జొన్నలు, ఎంకయ్య పువ్వులు, అరటి ఆకులు కొనేందుకు ప్రజలు మార్కెట్కు తరలిరావడం వల్ల ఎంజే మార్కెట్ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ ఏడాది భక్తులు ఎక్కువ శాతం మట్టి గణపయ్యను ప్రతిష్టించడానికే ప్రాధాన్యమిచ్చారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణకై చేపడుతున్న అవగాహన సదస్సులు ఫలితాన్నిచ్చాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలకే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు కరోనా మూడో దశ విస్తరించే అవకాశమున్నందున భక్తులు, మండపాల నిర్వాహకులు(Rush at markets in Hyderabad) అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గణేశ్ మండపాల వద్ద ఎక్కువగా గుమిగూడకూడదని హెచ్చరించారు. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తరచూ చేతులు శానిటైజ్ చేసుకోవాలని చెప్పారు.