Podu Lands Issue News: ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో పోడుభూములు సాగు చేసుకుంటున్న గిరిజన పేదలపై... రెవెన్యూ, పోలీసుల నిర్భందకాండ పెరిగిందని గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి గన్నెబోయిన వెంకటాద్రి అన్నారు. ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు అనుమతి నిరాకరించడంతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగూడం సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేశారు. గిరిజనులు, గిరిజనేతర పేదలు దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూములపై... హక్కులు సాధించే వరకు పోరాడతామని పేర్కొన్నారు.
'గవర్నర్, సీఎస్, ఇతర ప్రభుత్వాధికారులను కలిసి గిరిజన పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేద్దామనుకుంటే అపాయింట్ ఇవ్వకపోవడం దారుణం. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో పోడుభూములు సాగు చేసుకుంటున్న గిరిజన పేదలపై రెవెన్యూ, పోలీసుల నిర్భందకాండ పెరిగింది. ఐటీడీఏ అధికారులకు, కలెక్టర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఖాతరు చేయడం లేదు. పర్యావరణం పేరుతో ప్రజలపై దాడులు చేయడం ఆపాలి. గిరిజనుల న్యాయమైన హక్కులను గుర్తించాలి. ప్రభుత్వం అవలంభిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలను సంఘటిత పోరాటాల ద్వారా ఎండగడుతాం. గిరిజనులకు పోడుభూముల పట్టాలివ్వాలి... లేకపోతే ప్రభుత్వంపై ప్రజలే తిరగబడతారు.'-గన్నెబోయిన వెంకటాద్రి, గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి
ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జతిన్‌కుమార్, పడిగ యర్రయ్య, నేనావత్ రాందాస్, పాలెబోయిన ముత్తయ్య, కసరమోని లక్ష్మయ్య, గుత్తి రమేష్, చెరుకూరి పరమేష్, మధు, నరేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:YS Sharmila: 'పోడు భూములకు పట్టాలివ్వకుండా కేసీఆర్ మోసం చేశారు'