పచ్చటి మొక్కలతో కళకళలాడుతున్న ఈ ఇల్లు... ఏపీలోని నెల్లూరు జిల్లా వేదాయిపాలెం చైతన్యపురిలో ఉంది. ఈ ఇంటిపై నుంచి... కింద వరకు... ఎక్కడికక్కడే మొక్కలు దర్శనమిస్తాయి. డాక్టర్ రామ్ మాలేపాటి.... ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సీనియర్ మేనేజర్‌గా పని చేసి పదవీ విరమణ పొందారు. మార్కెట్లలోని లభించే కూరగాయల్లో... మితిమీరిన రసాయనాల వాడకంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రహించిన రామ్.. తానే స్వయంగా కూరగాయలు పండించాలని నిర్ణయించారు. నూతన విధానంలో మొక్కలు పండించేందుకు ఉపక్రమించి.. ఇంటి పెరటిలోను, పైకప్పుపైనా మొక్కలు పెంచుతూ... ఇంటిని నందనవనంలా తీర్చిదిద్దారు.
రామ్ తన ఇంట్లోని వెయ్యి చదరపు అడుగుల్లో... 500 మొక్కలను పెంచుతున్నారు. మొదటి అంతస్తులో అలంకరణ, ఔషధ మొక్కలు, రెండో అంతస్తులో వివిధ రకాల ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. ఖాళీ నీళ్ల సీసాలు, టెంకాయ చిప్పలు, వెదురు బొంగుల్లో.. సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తూ ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వాటికి నీరు అందిస్తున్నారు. మొక్కలను పంచడంలోనే ఆనందం, ఆరోగ్యం ఉందని రామ్ అంటున్నారు.
ఆ ఇంటి మిద్దె పైనే వెదురు కలపతో చక్కటి కుటీరం నిర్మించుకుని... అక్కడే కూర్చుని బొమ్మలు కూడా వేస్తారు. తాను పెంచే మొక్కలు గురించి వివరించేందుకు యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ పెట్టి.. మొక్కలు గురించి ప్రచారం చేస్తున్నారు.
- ఇదీ చదవండి : మిద్దె తోటలో కూరల సాగు.. ఆరోగ్యం బహుబాగు..