మద్యం తాగి వాహనం నడపడం, నిబంధనలు పాటించకపోవడం లాంటి నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో రోడ్డు ప్రమాదాలు ఎంతో మందిని బలి తీసుకుంటున్నాయి. ఎవరో ఒకరు నిర్లక్ష్యానికి... అది మరో కుటుంబం అంతటికి తీరని శోకాన్ని మిగిలిస్తోంది. రహదారి ప్రమాదాలను నివారించేందుకు... పౌరుల్లో అవగాహన కల్పించేందుకు కేంద్రం... జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకత, రహదారి ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలనే దానిపై డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలోనూ జనవరి 18 నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
2020లో 237 మంది..
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గతేడితో పోలిస్తే... ఈ ఏడాది జనవరిలో ప్రమాదాలు 46శాతం తగ్గాయని ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. గతేడాది జనవరిలో జరిగిన ప్రమాదాల్లో 24మంది చనిపోగా... ఈ ఏడాది జనవరిలో 13 మంది చనిపోయారు. 13మందిలో 9 మంది అతివేగం వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఒకరు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ప్రమాదం జరిగి చనిపోగా.. మరో ఇద్దరు నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల ప్రాణాలు కోల్పోయారు. 13 మంది మృతుల్లో ఆరుగురు శిరస్త్రాణం ధరించలేదు. 2019తో పోలిస్తే 2020లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో రహదారి ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గింది. 2019లో 271 మంది చనిపోగా... 2020లో 237 మంది ప్రాణాలు కోల్పోయారు.
రూ.25లక్షల జరిమానా..
ట్రాఫిక్ పోలీసుల తనిఖీల్లో దొరికిపోయే వాహనదారులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేస్తున్నారు. ట్రాఫిక్ శిక్షణా కేంద్రంలో మందుబాబులకు ప్రమాదాలపై దృశ్య మాధ్యమం ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. జనవరిలో 1201మందిని డ్రంక్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. 246మందిపై చార్జిషీట్ దాఖలు చేశారు. వీరిలో నలుగురికి జైలు శిక్ష విధించిన న్యాయస్థానం మిగతా వాళ్లందరికీ కలిపి రూ.25లక్షల జరిమానా విధించింది. ప్రమాదాల్లో బాటసారులు సైతం గాయపడుతుండటంతో.. జీబ్రా లైన్... పాదచారుల పైవంతెన, మెట్రో పైవంతెన వినియోగం పట్ల ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆటో, లారీ డ్రైవర్లకు, యువత, విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 17 వరకు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.
ఇవీ చూడండి: 'గొడ్డలి దాడి' నిందితుడిపై పీడీ యాక్టు, రౌడీషీట్: ఏసీపీ