కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా ఉన్న అవరోధాలను అధిగమించే దిశగా కేంద్ర జల్‌శక్తి శాఖ చర్యలు ప్రారంభించింది. అమలు పురోగతిని బోర్డుల ఛైర్మన్లతో సమీక్షించింది. కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌లతో జలశక్తి శాఖ ఉన్నతాధికారులు వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఇప్పటివరకు జరిగిన కసరత్తు, పురోగతిని ఆరా తీసినట్లు సమాచారం.
బోర్డుల ప్రతిపాదనలు, రెండు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన అభిప్రాయాలు, స్పందనలను బోర్డుల ఛైర్మన్లు కేంద్ర జల్‌శక్తి శాఖ ఉన్నతాధికారులకు వివరించినట్లు తెలిసింది. ఈ నెల 14 నుంచి గెజిట్ అమల్లోకి వచ్చినప్పటికీ ఒక్క ప్రాజెక్టును కూడా తమకు అప్పగించలేదని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంజినీర్లు, అధికారుల బృందాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ రెండు రాష్ట్రాలకు పంపే అవకాశం ఉందని అంటున్నారు.