Revanthreddy fires on BJP and TRS: నల్గొండ జిల్లా చండూరులో కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. మునుగోడులో కాంగ్రెస్‌కు వస్తున్న ఆదరణను చూసి ప్రత్యర్థులు తట్టుకోలేకపోతున్నారని.. అందువల్లే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు చర్యలతో కాంగ్రెస్ గెలుపును ఆపలేరని అన్నారు.
రాజకీయ కక్షలతో పార్టీ కార్యాలయం, ప్రచార సామగ్రిని దగ్ధం చేశారని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దిమ్మెలు కూల్చినా, కార్యాలయాలు తగలబెట్టినా కాంగ్రెస్‌దే విజయమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు పెట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేయకుంటే ఎస్పీ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా తెరాస, భాజపాకు వ్యతిరేకంగా ఆందోళనలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
అసలేం జరిగిందంటే.. నల్గొండ జిల్లా చండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీకి సంబంధించిన వాల్ పోస్టర్లు, జెండాలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. మంగళవారం చండూర్ మండలంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రచారం ఉంది. అలాగే రోడ్ షోకి కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సోమవారం రాత్రి ప్రచారానికి సంబంధించిన సామాగ్రిని కార్యాలయంలో ఉంచి వెళ్లారు. ఈ రోజు ఉదయం రాగానే కార్యాలయం నుంచి మంటలు రావడం గమనించారు. అదేంటని చూస్తే లోపల అగ్నికి పార్టీకి సంబంధించిన గోడపత్రికలు, ప్రచార సామాగ్రికి కాలి బూడిదై ఉన్నాయి.
ప్రచారానికి సిద్ధం చేసిన సామాగ్రిని పాడుచేయాలను కోవడం హేయమైన చర్యగా పార్టీ నాయకులు పేర్కొన్నారు. రాత్రి 11 గంటల సమయం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉన్నామని... ఉదయం వచ్చేసరికి సామాగ్రి ఉంచిన గది నుంచి పొగ రావడంతో పోలీసులకు, విద్యుత్ శాఖ వారికి సమాచారం ఇచ్చామన్నారు. పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమీపంలోనే రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీ వారే నిప్పు పెట్టారని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రతీకార చర్యగా ఈ ఘటనకు పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: