ఓటుకు నోటు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలో రాదన్న అంశంపై హైకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు ఎంపీ రేవంత్ రెడ్డి అనిశా కోర్టుకు తెలిపారు. అవినీతి నిరోధకశాఖ కోర్టులో ఇవాళ జరిగిన విచారణకు రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ హాజరయ్యారు. విచారణ జరుపుతామని అనిశా న్యాయస్థానం ఇటీవల ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేస్తామని, వారం రోజుల గడువు ఇవ్వాలని కోరారు. అభియోగాల నమోదు ప్రక్రియను వారం పాటు ఆపాలని విజ్ఞప్తి చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా కేసును త్వరగా తేల్చాల్సి ఉందని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం విచారణను ఈ నెల 16కు వాయిదా వేసిన కోర్టు... ఆ రోజున నిందితులందరూ కచ్చితంగా హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నెల 16 తర్వాత రెండు రోజుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాదులు సిద్ధం కావాలని పేర్కొంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో కొత్త బార్ల ఏర్పాటు దరఖాస్తుల గడువు పొడిగింపు