మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ప్రజాకవి వంగపండు ప్రసాదరావు మరణం పట్ల కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి స్పందించారు. వారిద్దరి అకాల మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.
ఆదరణకు నిదర్శనం..
సున్నం రాజయ్య మరణం పేద, బడుగు బలహీన, గిరిజన వర్గాలకు తీరని లోటని రేవంత్ పేర్కొన్నారు. నేటి రాజకీయాలల్లో నీతి, నిజాయతీకి ఆయన ప్రతిరూపమని కొనియాడారు. 2014 నుంచి 2018 వరకు అసెంబ్లీలో ఆయనతో కలిసి పనిచేసినట్లు తెలిపారు. గిరిజనుల భూమి హక్కులు, ఇతర సమస్యలపై రాజీలేని పోరాటం చేశారని ప్రశంసించారు. భద్రాచలం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడం.. ప్రజల్లో ఆయనకున్న ఆదరణకు నిదర్శనమన్నారు. రాజయ్య కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
సాంస్కృతిక లోకానికి..
తెలుగు రాష్ట్రాల్లో జానపదం అనగానే గుర్తొచ్చే పేరు వంగపండు ప్రసాదరావు అని రేవంత్ రెడ్డి అన్నారు. మూడు దశాబ్దాలుగా.. సుమారు మూడు వందల జానపదాలతో అణగారిన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చారని పేర్కొన్నారు. అలాంటి గొంతుక మూగబోవడం బాధాకరమన్నారు. వంగపండు మృతి బడుగుబలహీన వర్గాలకే కాదు.. తెలుగు సాంస్కృతిక రంగానికి, యావత్ తెలుగు జాతికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వంగపండు మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన రేవంత్రెడ్డి.. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.
ఇవీచూడండి: కరోనా సోకి మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి