అర్హులైన వరద బాధితులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కూకట్పల్లి జోనల్ కమిషనర్ మమతకు వినతి పత్రాన్ని అందజేశారు. పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. అసలైన అర్హులను వదిలి తెరాస కార్యకర్తలకు మాత్రమే ఆర్థిక సహాయాన్ని అందజేశారని విమర్శించారు.
అలాగే ఎందుకు వేయలేదు:
కొవిడ్ సమయంలో పేద ప్రజలకు రూ,1500 అకౌంట్లలో వేసి ఏవిధంగా సహాయం అందించారో ఇప్పుడు వరద బాధితులకు కూడా అలాగే ఎందుకు అందజేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. అధికారులకు మాత్రమే పంపిణీ బాధ్యతలను ఇస్తే తెరాస నాయకుల చేతిలోకి ఎలా డబ్బులు వెళ్తున్నాయని మండిపడ్డారు.
వంటావార్పు కార్యక్రమం:
కూకట్పల్లి జోన్ పరిధిలో ఇప్పటివరకు ఏ కాలనీలో, ఏ బస్తీలో ఎంత పంపిణీ చేశారనే వివరాలను తనకు రాత పూర్వకంగా ఇవ్వాలని జోనల్ కమిషనర్ మమతను కోరారు. సంబంధిత వివరాలను రెండు రోజుల్లో పూర్తిగా ఇవ్వాలన్నారు. లేనియెడల తమ పార్టీ ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామన్నారు. కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.
జోనల్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను నెట్టుకుంటూ ముందుకు వచ్చారు. కొద్దిసేపు తోపులాట చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: మంత్రులు, కార్యదర్శులతో రేపు సీఎం కేసీఆర్ సమావేశం..!