Revanth Reddy at Vidyut Soudha : చమురు ధరల పెంపు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ చేపడుతున్న నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధంగా ప్రవర్తించడమేనని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతోంటే.. రాష్ట్ర సర్కార్ తమను గృహనిర్బంధం చేయడమేంటని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే.. భాజపా, తెరాసలు జంట దొంగలనే విషయం అర్థమవుతోందని అన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్, మోదీలు అవిభక్త కవలలు అని విమర్శించారు. వడ్ల కొనుగోలు విషయంలో తెరాస- భాజపా కలిసి నాటకం ఆడుతోందని మండిపడ్డారు. తెరాస ధర్నాలు చేస్తే పట్టించుకోని పోలీసులు కాంగ్రెస్ శ్రేణులు నిరసన ప్రదర్శన చేస్తుంటే ఎందుకు అరెస్టు చేస్తున్నారని రేవంత్ నిలదీశారు.
Congress Protest in Hyderabad : చమురు, విద్యుత్ ఛార్జీల పెంపు, ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఈ క్రమంలో ముందుస్తుగా పోలీసులు పలువురు హస్తం నేతలను గృహనిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలను ఇళ్లలోనే నిర్బంధించారు. రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు. తన ఇంటి నుంచి రేవంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి విద్యుత్ సౌధ వద్దకు బయలుదేరారు. దారిపొడవునా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా నినాదాలు చేస్తూ వెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడగట్టుకుని ప్రజలను, రైతులను దారుణంగా మోసం చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు.
విద్యుత్ సౌధ వద్ద భారీ సంఖ్యలో కాంగ్రెస్ మహిళా నేతలు మోహరించారు. సౌధ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. వారిని అడ్డుకున్న పోలీసులు గోషామహల్ మైదానానికి తరలించారు.
ఇదీ చదవండి : కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం.. నిరసనకు వెళ్లకుండా అడ్డగింత