రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఇంజినీరింగ్ అధికారుల సేవలు వినియోగించుకుంటోంది. ఇటీవల పదవీ విరమణ చేసిన అనిల్ కుమార్‌ను దేవాదాయశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా నియమిస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. సుధీర్ఘకాలం వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌గా చేసిన ఆయన... కొంతకాలం దేవాదాయశాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. పౌరసరఫరాలశాఖ కమిషనర్‌గా మరో విశ్రాంత ఐఏఎస్ సత్యనారాయణ రెడ్డిని నియమించింది. ఈయన ఉమ్మడి నల్గొండ కలెక్టర్‌గా, కాలుష్య నియంత్రణ మండలి సభ్యకార్యదర్శిగా పనిచేశారు.
ఆర్థికశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన మరో విశ్రాంత ఐఏఎస్ అధికారి శివశంకర్... సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలను చూస్తున్నారు. ఐఏఎస్‌లు రాజీవ్ శర్మ, రమణాచారి, ఐపీఎస్‌లు అనురాగ్ శర్మ, ఏకేఖాన్, ఈఎన్‌సీ జీఆర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నారు. రాజీవ్ శర్మ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మెన్‌గా, సీజీజీ ఎక్జిక్యూటివ్ ఛైర్మెన్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి నర్సింగ్ రావు, ఐఎఫ్ఎస్ అధికారి భూపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్నారు.
ముఖ్యమంత్రి భద్రతాధికారి ఎంకేసింగ్ సహా నిఘా విభాగంలో, మరికొందరు ఐపీఎస్‌లు సుధీర్ఘకాలంగా విధుల్లో ఉన్నారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు కూడా కొనసాగింపులోనే ఉన్నారు. ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు మురళీధర్, వెంకటేశ్వర్లు, గణపతిరెడ్డి, రవీందర్ రావు, సత్యనారాయణరెడ్డి, కృపాకర్ రెడ్డి, ధన్‌సింగ్, సురేష్ కుమార్ పదవీకాలం పూర్తైనవారే. వీరితో పాటు రెండు జిల్లాల్లో సంయుక్త కలెక్టర్లు, కొంతమంది ఓఎస్డీలు విధుల్లో కొనసాగుతున్నారు.
ఇదీ చూడండి: తూటా ఏ తుపాకిది? ఎవరు కాల్చారు? ఎవరికి తాకింది?