Group-1 Notification Updates : గ్రూప్-1 ప్రకటనలో క్రీడాకారుల పోస్టుల రిజర్వేషన్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) స్పష్టత ఇచ్చింది. రోస్టర్ పాయింట్ పట్టిక ప్రకారం మంజూరైన పోస్టులను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు ఖరారు చేశామని వెల్లడించింది. గ్రూప్-1లో 503 పోస్టులు మంజూరైతే క్రీడాకారుల కోటా ప్రకారం 2శాతం లెక్కన పది పోస్టులు ఉండాలని, కానీ ఒక పోస్టు మాత్రమే కేటాయించారని కొన్ని క్రీడా సంఘాలు కమిషన్ దృష్టికి తీసుకువచ్చాయి.
Sports Category in Group-1 : ఈ విషయమై కార్యాలయానికి వచ్చిన ప్రతినిధులకు రోస్టర్ పాయింట్ ప్రకారం రిజర్వేషన్ల అమలుపై కమిషన్ వర్గాలు వివరించాయి. రోస్టర్‌పట్టిక ప్రకారం 1-100 పాయింట్లలో 48వ పాయింట్, 98వ పాయింట్ క్రీడాకారులకు రిజర్వు అయ్యాయని తెలిపాయి. ప్రభుత్వ విభాగాలు, మల్టీజోన్ల వారీగా మంజూరైన పోస్టులకు ఆయా జోన్లలో రోస్టర్ పట్టిక ప్రకారం పోస్టుల రిజర్వేషన్లు లభిస్తాయని పేర్కొన్నాయి.
503 పోస్టులన్నీ ఒకే విభాగంలో, ఒకే జోన్లో లేవని... ఈ లెక్కన 2శాతం అంటే పదిగా పేర్కొనడం సరికాదని వివరించాయి. జోన్-1లో ఎంపీడీవో పోస్టులు 72 ఉన్నాయని, అందులో క్యారీఫార్వర్డ్ పోస్టులు మూడు తీసివేయగా 69 మంజూరైన పోస్టులు అవుతాయని తెలిపింది. ఈ లెక్కన రోస్టర్‌లో 48వ పాయింట్‌కింద ఒక పోస్టు క్రీడాకారులకు మంజూరైందని ఆయా ప్రతినిధులకు కమిషన్ వర్గాలు స్పష్టం చేశాయి. రిజర్వేషన్లపై కొన్ని వర్గాల నుంచి అభ్యంతరాలు వస్తుండటంతో, రోస్టర్, పోస్టుల రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చేలా ‘తరచూ అడిగే ప్రశ్నలు (ఎఫ్‌ఏక్యూ)’లో వివరణలు పొందుపరచాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది.
Sports Quota Reservation in Group-1 : టీఎస్‌పీఎస్సీ వన్‌టైమ్ రిజిస్ట్రేషన్లు శుక్రవారానికి 2 లక్షలు దాటాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఓటీఆర్‌లో సవరణలు చేసుకునేందుకు కమిషన్ ఇప్పటికే వెసులుబాటు కల్పించింది. టీఎస్‌పీఎస్సీ వద్ద 25 లక్షల మంది ఉద్యోగార్థులు నమోదయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 1.4 లక్షల మంది అభ్యర్థులు ఓటీఆర్‌ను సవరించుకున్నారు. ఇప్పటివరకు మరో 60వేల మంది అభ్యర్థులు కొత్తగా రిజిస్ట్రేషన్ అయ్యారు.
రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హమైన ఓటీఆర్‌ల సంఖ్య 2 లక్షలు దాటింది. ఉద్యోగార్థులు చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా, సకాలంలో ఓటీఆర్ సవరణ, కొత్తగా నమోదు చేసుకోవాలని కమిషన్ కోరుతోంది. 25 లక్షల మంది ఉద్యోగార్థులకు ఓటీఆర్ సవరణలు చేసుకోవాలని కోరుతూ కమిషన్ ఈ-మెయిళ్లు పంపిస్తోంది.
ఇవీ చదవండి :