తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను వైద్య సంఘాల ప్రతినిధులు కలిశారు. వైద్యులు, వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి వసతుల కొరత లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
గాంధీ ఆసుపత్రిలోనే కాకుండా.. జిల్లాల వారీగా కొవడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఈటలను కోరినట్లు డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ తెలిపారు. వైద్యులపై పడుతోన్న ఒత్తడి తగ్గించేందుకు ఆరోగ్యశాఖ నుంచి నియామకాలు చేపట్టాలని కోరారు.
ఈ ఆపత్కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తోన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వైద్య సిబ్బంది, వైద్యులను రెగ్యులర్ చేయాలని వైద్య సంఘాల ప్రతినిధులు మంత్రి ఈటలను డిమాండ్ చేశారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆరోగ్య శాఖ మంత్రి అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారని వైద్య సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.