ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ సేవల్లో కొన్ని గంటల పాటు అంతరాయం నెలకొన్న ఘటన జరిగి కొన్ని గంటలు కూడా గడవకముందే సాంకేతిక ప్రపంచంలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. జియో నెట్‌వర్క్ కనీసం రెండున్నర గంటల పాటు డౌన్ అయినట్టు తెలిసింది. అనేక మంది వినియోగదారులు నో సర్వీస్ అని వస్తున్నట్టు ట్విట్టర్లో పేర్కొనటంతో జియో నెట్‌వర్క్ డౌన్ సంబంధిత ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
కొంత మంది యూజర్లు జియో నెట్‌వర్క్ ఉదయం నుంచి పనిచేయడం లేదని ఫిర్యాదు చేయగా, ఇంకొందరు జియో బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌దీ అదే పరిస్థితి అని వివరించారు. నెట్‌వర్క్ సేవలను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్ పోర్టల్ సమాచారం ప్రకారం, జియో ప్రస్తుతం నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే వేలాది మంది జియో నెట్‌వర్క్‌పై ఫిర్యాదు చేశారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్ రాష్ట్రాలు సహా ఢిల్లీ, బెంగళూరు, ఇతర కొన్ని నగరాల్లో ఈ సమస్య ఉన్నట్టు తెలుస్తోంది.
రిలయన్స్ జియో అధికారిక కస్టమర్ సపోర్ట్ హ్యాండిల్‌లో నెట్‌వర్క్ రావడం లేదని ట్విట్టర్ యూజర్లు ఫిర్యాదులతో పోటెత్తుతున్నారు. దీనిపై జియో కేర్ స్పందించింది. యూజర్లకు కలిగిన అంతరాయానికి చింతిస్తున్నామని పేర్కొంది. అయితే ఇది ఇంటర్నెట్ సేవలు, కాల్స్, ఎస్ఎంఎస్ సేవల్లో సాధారణంగా తలెత్తే సమస్యే అని వివరించింది. కేవలం ఇది తాత్కాలికమైన సమస్యని, వీలైనంత త్వరగా పరిష్కరించడానికి పనిచేస్తున్నామని సంస్థ పేర్కొంది.
ఇదీ చదవండి : హైదరాబాద్‌లో పదిహేడేళ్ల బాలికపై అత్యాచారం