వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఈనెల 23 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఇటీవల మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అందుకు సంబంధించిన అంశాలపై సీఎం ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రులు సబిత, పువ్వాడ అజయ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభం విషయమై చర్చించారు.
ప్రజలేమంటున్నారు..
ధరణి ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన వ్యవసాయ భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియ ప్రజల ఆదరణ పొందుతోందని.. అద్భుతమైన స్పందన వస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. భూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఒక చారిత్రక శకం ప్రారంభమైనట్లుగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. ధరణి ద్వారా వ్యవసాయ భూములకు భరోసా దొరికిందనే సంతృప్తి, నిశ్చింతను వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.
అధికారులకు అభినందనలు..
ధరణి పోర్టల్ చిన్న చిన్న సమస్యలను అధిగమించిందన్న కేసీఆర్... మరో మూడు, నాలుగు రోజుల్లో నూటికి నూరు శాతం అన్నిరకాల సమస్యలను అధిగమిస్తుందన్నారు. సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాకే వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాలనుకొన్నామని, అందుకే కొన్నాళ్లు వేచి చూసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈనెల 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభిస్తారని చెప్పారు. ధరణి పోర్టల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారని అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు.
ఇవీచూడండి: ధరణితోనే లావాదేవీలు.. ఏకకాలంలోనే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్