కంది రైతులకు ప్రైవేటు వ్యాపారులే దిక్కయ్యారు. వారే ఎక్కువ పంటను కొనేలా ప్రస్తుత పరిస్థితులున్నాయి. గత రెండు నెలల నుంచి మద్దతు ధరకన్నా తక్కువ చెల్లించి అత్యధికశాతం పంటను వ్యాపారులు కొంటున్నారు. దేశంలో పప్పు ధాన్యాలకు కొరత ఉన్నందున మద్దతు ధరకు తెలంగాణలో 7.70 లక్షల క్వింటాళ్లను కొనేందుకు కేంద్ర వ్యవసాయశాఖ రాష్ట్రానికి నెలక్రితం అనుమతించింది. రాష్ట్రంలో దిగుబడి ఎక్కువగా ఉందని, మరో 10 లక్షల క్వింటాళ్ల కొనుగోలుకైనా అనుమతించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇటీవల కేంద్ర వ్యవసాయశాఖ మంత్రికి లేఖ రాశారు. దానికింకా స్పందన రాలేదు.
రాష్ట్రంలో ఈ సీజన్‌లో 84.40 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అర్థ, గణాంకశాఖ ముందస్తు అంచనాల్లో తెలిపింది. వర్షాల వల్ల పంట దెబ్బతిందని, 38 లక్షల క్వింటాళ్లకు మించి రాకపోవచ్చని మార్కెటింగ్ శాఖ అనధికార అంచనా. ఈ రెండింటిలో ఏ అంచనాను పరిగణనలోకి తీసుకున్నా కేంద్రం అనుమతించిన 7.70 లక్షల క్వింటాళ్లు చాలా తక్కువని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో హడావుడిగా కొనుగోలు కేంద్రాలు తెరిస్తే వారం రోజుల్లోనే కేంద్రం అనుమతించిన 7.70 లక్షల క్వింటాళ్ల పరిమితి మేరకు రైతులు తెస్తారని మార్క్‌ఫెడ్ భయపడుతోంది.
ఈ పరిమితి దాటిన తరవాత అదనంగా కొనాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతించి నిధులు కేటాయించాలి. కేంద్రం అదనంగా అనుమతించకపోతే ఏం చేయాలో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మార్క్‌ఫెడ్ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై అంతర్గతంగా ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. అదనపు కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు తెలిసేవరకూ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడమే మంచిదని జాప్యం చేస్తున్నారు. ఈ వ్యవహారం ప్రైవేటు వ్యాపారులకు లాభదాయకంగా మారింది. ఇప్పటికే తాండూరు(వికారాబాద్), తిరుమలగిరి, సూర్యాపేట తదితర మార్కెట్లకు రైతులు తెచ్చిన 97 వేల క్వింటాళ్లను వ్యాపారులు కొన్నారు. వీటిలో సగానికి పైగా పంటకు మద్దతు ధర ఇవ్వలేదు. క్వింటా మద్దతు ధర రూ.6 వేలు కాగా 5,200 నుంచి 6 వేల లోపు చెల్లిస్తున్నారు. మద్దతు ధరకు మార్క్‌ఫెడ్ కొనడం ప్రారంభిస్తే మార్కెట్‌లో పోటీ పెరిగి వ్యాపారులు కూడా ధర పెంచి కందులను కొనే అవకాశాలుండేవని, ఇప్పుడు వ్యాపారులు ఇచ్చినంత ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బయట కొన్న లెక్కలు లేవు
కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చినందున వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన పంటల కొనుగోలు లెక్కలే మార్కెటింగ్ శాఖ దగ్గర ఉన్నాయి. ఈ చట్టాల ప్రకారం మార్కెట్ల బయట, గ్రామాలకెళ్లి వ్యాపారులు కొంటున్న పంటల లెక్కలు ఈ శాఖకు ఇవ్వడం లేదు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే ఇప్పటికే రెండు లక్షల క్వింటాళ్లకు పైగా వ్యాపారులు కొనేసినట్లు ఓ టోకు వ్యాపారి ‘ఈనాడు’కు చెప్పారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు తెరిస్తే ఇదే వ్యాపారులు మళ్లీ అదే రైతుల పేర్లతో మద్దతు ధరకు అమ్ముకుందామని ఎదురుచూస్తున్నట్లు ఆయన వివరించారు.
- ఇదీ చూడండి : గో సంతతి వృద్ధి.. ఆదాయం సమృద్ధి!