రాష్ట్రానికి భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ సోమ, మంగళవారాల్లో కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు అంచనా వేస్తోంది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలు పరిసర ప్రాంతాల్లో ఏకంగా 61 సెంటీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని లెక్కకట్టింది. రాష్ట్రంపై ఉన్న మేఘాల ఉద్ధృతి నమూనాలను పలుమార్లు పరిశీలించి ఈ మేరకు అంచనా వేస్తోంది. దాదాపు ఎక్కువ ప్రాంతాల్లో 35 సెం.మీ. దాటి వర్షపాతం నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ కె.నాగరత్న 'ఈనాడు'కు వివరించారు. ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా రాష్ట్రంపై దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయన్నారు. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు మరింత భారీగా పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాంతంలో చరిత్రలోనే జులై నెలలో అత్యంత భారీ వర్షం నమోదైంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు 35 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతోపాటు రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో అత్యంత భారీ వానలు పడ్డాయి. 20 ప్రాంతాల్లో అతి భారీ వర్షం, 56 ప్రాంతాల్లో భారీ వర్షం నమోదవ్వడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా 344 ప్రాంతాల్లో సెంటీమీటరు నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వర్షం కురుస్తూనే ఉంది. కొన్నిచోట్ల ముసురు పట్టినట్లు ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తూ కొంత సమయం తెరిపి ఇచ్చాయి.
జిల్లాల్లో పరిస్థితి ఇలా..
నిర్మల్ జిల్లాలోని మామడ మండలం కిషన్‌రావుపేట్, ఖానాపూర్ మండలం రాజురా గ్రామంలోని పన్నీర్ చెరువులకు గండి పడటంతో నీరు బయటకు పోయింది. ముథోల్ మండలంలో ఓని- బాసర రహదారి, లోకేశ్వరం-పేండ్‌పెల్లి గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఆసిఫాబాద్ మండలంలోని చిర్రకుంట, తుంపల్లి, వట్టవాగులు ఉప్పొంగి ప్రవహించడంతో కొన్ని గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కోటపల్లి మండలం లక్ష్మిపూర్ వద్ద వరదనీటిని మళ్లించేందుకు 63వ జాతీయ రహదారిని తవ్వడంతో మహారాష్ట్రకు రాకపోకలు నిలిచాయి.
- జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ వద్ద భారీ వృక్షం నేలకూలింది. సమీపంలోనే అనంతారం వాగు పొంగి రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండటంతో నేరెళ్ల వద్ద రహదారి జలమయమైంది.
- పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఓ రేకుల షెడ్డుపై భారీ వృక్షం కూలింది. రాయికల్ పట్టణ శివారులో బతుకమ్మ వాగులో గూడ్స్ ఆటో బోల్తాపడింది. డ్రైవర్ సురక్షితంగా బయటపడగా.. క్రేన్ సాయంతో ఆటోను బయటకు తీశారు.
- ములుగు జిల్లా శనిగకుంటలో చప్టాపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
- భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో వాగుల ఉద్ధృతితో 24 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పెద్దంపేట వాగు ప్రవాహంతో రోడ్డు తెగిపోయి పలిమెల మండలానికి రాకపోకలు బంద్ అయ్యాయి.
చేపల వరద అలా.. అడ్డుగా జాలీ ఇలా..
మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం జగదేవుపేటలోని జంగల్‌నాలా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరి మత్తడి పారుతోంది. ఈ నీటిలో చేపలు భారీగా బయటికి వస్తున్నాయి. వీటిని పట్టుకునేందుకు జాలర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ఇనుప జాలీల్లో చిక్కుకుపోయి ఇలా కనిపించాయి.
తరగతి గదిలో నీరు.. ఎలా చదువుకొనేరు
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని జ్యోతిరావు ఫులే గురుకుల పాఠశాలలోకి మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. విద్యార్థులను కలుసుకునేందుకు ఆదివారం వచ్చిన వారి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియడంతో రాస్తారోకో చేశారు. సమస్య పరిష్కారానికి ప్రిన్సిపల్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఏడు జిల్లాల్లో వరదలు
ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరులో 18.3 సెం.మీ. భారీ వర్షం నమోదైంది. వేములపల్లి మండలం నీల్వాయిలో 15, కోటపల్లిలో 14.7 సెం.మీ. కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముత్తారం(మహదేవ్‌పూర్)లో 14.7, మహదేవ్‌పూర్ లో 12.5 సెం.మీ కురిసింది. పెద్దపల్లి జిల్లా పాలెంలో 11, జగిత్యాల జిల్లా మన్నెగూడెంలో 10.6, భద్రాద్రి కొత్తగూడెంలో 10.3 సెం.మీ. వర్షం కురిసింది.
ఇద్దరు మహిళల మృతి
- వానల కారణంగా వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు మహిళలు మరణించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి గ్రామంలో అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ బోర ఆదిలక్ష్మి(36) ఆదివారం విద్యుదాఘాతంతో మరణించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం గాంధీనగర్‌లో ఆదివారం కురిసిన వర్షానికి పెంకుటిల్లు కూలిపోవడంతో వృద్ధురాలు జయమ్మ(65) మృతి చెందారు
- ఏకాదశి పుణ్యస్నానాల నిమిత్తం వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన 25 మంది యాత్రికులు బస్సులో కాళేశ్వరం వస్తుండగా వాహనం వరదలో చిక్కుకుంది. గ్రావిటికాలువ సమీపంలోని మట్టిలో కూరుకుపోయింది. అధికారులు వచ్చి పొక్లెయిన్ సహాయంతో బస్సును బయటకు లాగారు.
11, 12 తేదీల్లో...
- అత్యంత భారీ వర్షాలు పడే ప్రాంతాలు: నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి
- అతి భారీ వర్షాలు: రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, మెదక్ జిల్లాలు
- సాధారణ వర్షాలు: జనగామ, సిద్దిపేట, హైదరాబాద్
ఇదీ చూడండి : వర్షాలపై సీఎం సమీక్ష.. మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులు