telangana education department recruitment : పాఠశాల విద్యాశాఖలో ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రత్యక్ష నియామకాల కింద భర్తీచేసే వాటిపై దృష్టి సారించారు. నెల క్రితం పాఠశాల విద్యాశాఖలో 13,086 ఉద్యోగ ఖాళీలను నింపుతామని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. అందులో దాదాపు 10వేల వరకు ఉపాధ్యాయ కొలువులు ఉంటాయి. మిగిలిన వాటిలో 24 ఉప విద్యాశాఖ అధికారులు(డిప్యూటీఈవో) ఖాళీలున్నాయి.
రాష్ట్రంలో 72 డిప్యూటీఈవో పోస్టులు మంజూరు కాగా, ప్రస్తుతం నలుగురే పనిచేస్తున్నారు. అంటే 68 ఖాళీల్లో 33 శాతాన్ని ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయవచ్చు. ఈ క్రమంలో 24 ఖాళీలను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నింపుతారు. మిగిలిన వాటిని ఎంఈవో, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, డైట్ అధ్యాపకులకు పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి. ఏకీకృత సర్వీస్ నిబంధనల కేసు న్యాయస్థానంలో ఉన్నందున అది తేలేవరకు వాటి భర్తీ ఉండదు.
ఇంకా డీఈడీ కోర్సులను అందించే జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)ల్లో 23 సీనియర్ అధ్యాపకులు, 61 అధ్యాపకుల ఖాళీలను ప్రత్యక్ష నియామకాల ద్వారా నింపనున్నారు. ఎస్‌సీఈఆర్‌టీ, ప్రభుత్వ బీఈడీ కళాశాల(సీటీఈ)ల్లో మరో 26, దోమల్‌గూడలోని ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల(జీసీపీఈ)లో 8 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారా నింపుతారని తెలిసింది. వాటిలోనూ పదోన్నతుల ద్వారా నియమించాల్సినవి పెండింగ్‌లో ఉండనున్నాయి.
- ఇదీ చదవండి : తరుగు పేరుతో ధాన్యంలో కోత పెట్టొద్దు: మంత్రి గంగుల
క్రమబద్ధీకరణ ఉద్యోగులు 44 శాతం విద్యాశాఖలోనే... ప్రభుత్వం ఇటీవల 11,103 మంది ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించటం తెలిసిందే. అందులో 44 శాతం మంది విద్యాశాఖ పరిధిలోనే ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 3,683 మంది, డిగ్రీ కళాశాలల్లో 811, పాలిటెక్నిక్‌లలో 443... మొత్తం 4,937 మంది ఉన్నట్లు అధికారులు తేల్చారు. క్రమబద్ధీకరణ ఉద్యోగుల్లో సగం మంది విద్యాశాఖలోనే ఉన్నారని ఇటీవల విద్యామంత్రి సబిత కూడా ప్రకటించారు. సీఎం ప్రకటించి 40 రోజులు దాటింది. ఆయా విభాగాల్లో ఎంత మంది అర్హులు ఉన్నారో జాబితా పంపాలని వాటి అధిపతులను ఆర్థికశాఖ దాదాపు 25 రోజుల క్రితమే కోరింది. ఈ క్రమంలో దానిపై జీవో ఎప్పుడు వెలువడతుందా అని ఒప్పంద అధ్యాపకులు ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి :