హైదరాబాద్ విరించి అస్పత్రి వైద్యులు గత నెలలో మూత్రపిండాల మార్పిడిని దిగ్విజయంగా పూర్తి చేశారు. కొవిడ్ నుంచి కోలుకున్న మహిళ నుంచి మూత్రపిండాన్ని సేకరించి ఆమె భర్తకు అమర్చారు. డాక్టర్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన శస్త్రచికిత్స అనంతరం ఇటీవల వారిని ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ చేసినట్టు వైద్యులు ప్రకటించారు.
జూన్ 20న మూత్ర పిండాల వ్యాధితో ఆస్పత్రికి వచ్చిన రాజ్ కుమార్ అనే వ్యక్తికి.. అవయవ మార్పిడి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కిడ్నీ దానం చేసేందుకు అతని భార్య రేవతి ముందుకు వచ్చినప్పటికీ.. రెండు సార్లు రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, మూడో సారి రేవతికి కొవిడ్ సోకటంతో శస్త్రచికిత్సను వాయిదా వేస్తూ వచ్చారు. గత నెలలో విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు. రేవతి కరోనా బారిన పడినప్పటికీ కోలుకుని పట్టుదలతో కిడ్నీ దానం చేయటం పట్ల వైద్యులు అభినందనలు తెలియజేశారు.