Statue of Equality Inauguration: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో నాలుగోరోజు రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 12 రోజుల పాటు కొనసాగనున్న సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు కీలక ఘట్టాలు జరగనున్నాయి. కాగా.. ముచ్చింతల్‌కు ప్రధాని రాక దృష్ట్యా మహాయాగంలో నేడు స్వల్ప మార్పులు చేశారు. ఈమేరకు ఋత్వికులు, భక్తులకు చినజీయర్ స్వామి పలు సూచనలు చేశారు. యాగశాలలో ఈరోజు 11.30 వరకే లక్ష్మీనారాయణ మహాయజ్ఞం నిర్వహించనున్నారు. సాధారణంగా.. ఉదయం10 నుంచి మధ్యాహ్నం 12.30వరకు.. సాయంత్రం 6 నుంచి 9 వరకు.. రెండు దశలుగా మహాయాగం జరుగుతోంది. సాయంత్రం 4 గంటల్లోపే ఋత్వికులు యాగశాలకు చేరుకొని యాగం మొదలుపెట్టాలి. సాయంత్రం 4 తర్వాత యాగశాల నుంచి ఋత్వికులు, భక్తులెవరూ బయటికి రావద్దు. యాగశాల నుంచే భక్తులు, ఋత్వికులు విగ్రహ ఆవిష్కరణను వీక్షించాలని చినజీయర్ స్వామి సూచించారు.
"ప్రధాని రాక సందర్భంగా యాగశాల ప్రాంగణంలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. అనుమతి ఉన్న వ్యక్తులు మాత్రమే యాగశాలకు రావాలి. రేపటి నుంచి యథాతథంగా యాగశాల పరిసరాల్లో అనుమతులుంటాయి. ముచ్చింతల్ లో రాత్రి 8.30 గంటల తర్వాత ప్రధాని పర్యటన ముగుస్తుంది. రాత్రి 8.30 గంటల వరకు యాగశాల, సమతామూర్తి కేంద్రం పరిసరాల్లో ఆంక్షలుంటాయి. ఇది గమనించి భక్తుల సహకరించాలని ప్రార్థన."- చినజీయర్ స్వామి
మోదీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ..
సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు అత్యంత కీలకమైన ఘట్టం జరగబోతుంది.త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆరేళ్ల సంకల్ప సిద్ధికి ఆకారంగా తీర్చిదిద్దిన 216 అడుగుల రామానుజచార్యుల పంచలోహ విగ్రహాన్ని దేశ ప్రధాని నరేంద్రమోదీ లోకార్పణం చేయనున్నారు. వసంత పంచమి వేళ.. వేలాది భక్తులు, వేద పండితుల నమో నారాయణ మంత్రం మారుమోగుతుండగా.. ఇవాళ సాయంత్రం 7 గంటలకు సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కన్నుల పండువగా జరుగనుంది.
3 గంటల పాటు ప్రధాని పర్యటన
PM Muchinthal Tour: దిల్లీ విమానాశ్రయం నుంచి బయల్దేరి శనివారం మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి పటాన్ చెరువులోని ఇక్రిశాట్‌కు చేరుకుంటారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనున్న మోదీ... నాలుగున్నరకి తిరిగి శంషాబాద్ వస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని ముచ్చింతల్‌కు చేరుకుంటారు. దాదాపు 3 గంటలపాటు సమతామూర్తి కేంద్రంలోనే మోదీ పర్యటిస్తారు. మొదట యాగశాలకు చేరుకొని విశ్వక్ సేనుడిని ఆరాధిస్తారు. అక్కడి నుంచి సమతామూర్తి కేంద్రానికి వస్తారు. ఆ తర్వాత 108 దివ్యదేశాలను సందర్శిస్తారు. భద్రవేది మొదటి అంతస్తులో ఉన్న రామానుజచార్యుల 120 కిలోల బంగారు విగ్రహాన్ని తిలకిస్తారు. అనంతరం భద్రవేదిపై బ్రహ్మాండ నాయకుడిగా కొలువుదీరిన సమతామూర్తి విగ్రహానికి చిన్నజీయర్ స్వామి సమక్షంలో పూజలు నిర్వహించి జాతికి అంకితం చేస్తారు. ఆ తర్వాత శ్రీరామానుజచార్యుల విశిష్టతపై అరగంట పాటు ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే సమతామూర్తిపై రూపొందించిన 3డీ మ్యాపింగ్‌ను ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి వీక్షిస్తారు. సుమారు 15 నిమిషాలపాటు ఆ ప్రదర్శన ఉంటుంది. అనంతరం మచ్చింతల్ నుంచి రహదారి మార్గంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని దిల్లీ వెళ్లనున్నారు.
ప్రధానితో మోదీతో పాటు వారికే..
సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో వేదికపై మోదీతోపాటు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వరరావుకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులు, నిర్వాహకులకెవరికీ అనుమతి లేదు. మరోవైపు ప్రధాని రాక సందర్భంగా సమతామూర్తి కేంద్రం చుట్టూ భద్రతా బలగాలు ముందస్తుగా కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. విగ్రహ పరిసరాలకు వాలంటీర్లు, ఇతర భక్తులెవరిని అనుమతించలేదు. డీజీపీ మహేందర్ రెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, ఇతర ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం, ఇక్రిశాట్, ముచ్చింతల్‌లో 8 వేల మంది పోలీసులతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: