Pet Raising : నగరంలో ప్రస్తుతం పక్షుల్లో ఎక్కువగా పెంచుకుంటున్న రామచిలుక జాతికి చెందిన హ్యాసింత్ మకావ్ రూ.10లక్షల దాకా ఖరీదు చేస్తోంది. శునకాల్లో ఎక్కువగా పెంచుకుంటున్న కప్ పొమేరియన్ రూ.1లక్ష, డాల్మేషన్ జాతి కుక్క రూ.40వేలు, హచ్ రూ.30వేలు, లాబ్రడార్ జాతి శునకం రూ.35వేలు, గోల్డెన్ రిట్రీవర్ రూ.30వేల దాకా ధర పలుకుతున్నాయి. మెయిన్ కూన్ జాతికి చెందిన మార్జాలం రూ.4.70లక్షలు ఖరీదు కాగా నగరంలో పలువురు దీన్ని పెంచుకుంటున్నారు. బ్లాక్ ప్యాంథర్ జాతి పిల్లి రూ.2లక్షలు, ఏషియన్ లియోపార్డ్ రూ.2.40లక్షలు, పర్షియన్ క్యాట్ రూ.2లక్షల దాకా ఖరీదు చేస్తున్నాయి. వీటికి ఒక్కో దానికి నెలకు కనీసం రూ.40వేల నుంచి రూ.1లక్ష దాకా ఆహారం, ఇతర అవసరాలకు ఖర్చవుతున్నా పెట్టేందుకు.. పెంచేందుకూ ఏమాత్రం తగ్గట్లేదు ఈ మూగ ప్రేమకు బానిసలు.
కనబడుటలేదు
Raising Pets in Hyderabad : ఇన్నాళ్లూ మనుషులు తప్పిపోతేనే, కనబడుట లేరనే ప్రకటనలు గోడలపై కనిపించేవి. ఇప్పుడు పెంపుడు జంతువుల కోసమూ దర్శనమిస్తున్నాయి. అదీ రూ.వేల పారితోషికం ప్రకటించారు. ఇటీవల ‘జింజర్’ అనే ఓ పిల్లి తప్పిపోయిందని, వివరాలు చెబితే రూ.30వేలిస్తామని టోలిచౌకికి చెందిన ఓ కుటుంబం ప్రకటించింది. వారం కిందట ‘జోయా’ అనే పిల్లి తప్పిపోయిందంటూ బంజారాహిల్స్‌కు చెందిన ఓ కుటుంబం రూ.20వేల నజరానా ప్రకటించారు. మూసాపేటకు చెందిన ఓ కుటుంబం పెంపుడు కుక్క ‘విక్కీ’ తప్పిపోయిందని తెలిసి విజయవాడ పర్యటన రద్దు చేసుకొని వెనక్కొచ్చింది. వివరాలు చెప్పినవారికి రూ.10వేల నజరానా ప్రకటించింది.
ఆరోగ్య బీమా.. ఆహార కేంద్రాలు!
Pet Raising Tips : ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువులకు ఆరోగ్య బీమా అందించే సంస్థతో నగరానికి చెందిన ఓ ఆసుపత్రి ఒప్పందం కుదర్చుకుని బీమా అందిస్తోంది. వెటర్నరీ ధ్రువీకరణ పత్రంతోపాటు మెడలో మైక్రోచిప్‌ను అమర్చి దాన్ని స్కాన్ చేస్తే వివరాలన్నీ తెలిసేలా పొందుపరుస్తున్నారు. రూ.1460 ప్రీమియంగా చెల్లిస్తే రూ.40వేల దాకా బీమా, రూ.15వేలు చెల్లిస్తే రూ.1.50లక్షల దాకా బీమా వర్తిస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు గచ్చిబౌలి, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్‌ల్లో పెట్స్ ఫ్రెండ్లీ రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. ప్రత్యేకంగా మీట్‌బాల్స్, సూప్స్, ప్రొటీన్ బౌల్, కెఫెలో కేక్స్‌లాంటి మెనూ ఉంచుతున్నాయి. పార్కులు, జిమ్‌లూ ఏర్పాటు చేయడం విశేషం.