Rains in Telangana Today : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. ఇది ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్ ప్రాంతం వరకూ విస్తరించింది. మరోవైపు తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. దాంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీగా వర్షం పడుతోంది. హైదరాబాద్‌లోనూ జోరుగా వాన పడుతోంది. రేపు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Rains in Hyderabad: రాజధాని నగరంలో ఉదయం నుంచి పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, సరూర్‌నగర్, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, మూసారాంబాగ్, మలక్‌పేట ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు, విద్యార్థులు, ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, శంషాబాద్, శాతంరాయి, శివరాంపల్లి, మణికొండ ప్రాంతాల్లో తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని పాతబస్తీలోని పలుప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్, పంజాగుట్ట, గోల్కొండ, మెహదీపట్నం, కార్వాన్, నారాయణగూడ, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో వరుణుడు దంచికొట్టాడు. అత్తాపూర్, ఉప్పరపల్లి, హైదర్‌గూడ,ఆదిభట్లలోనూ భారీ వర్షం పడుతోంది. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం కూడా ట్రాఫిక్ సమస్యకు మరో కారణమైంది.
సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా బంట్వారం(వికారాబాద్ జిల్లా)లో 9.3, హైదరాబాద్‌లోని ఈస్ట్ ఆనంద్‌బాగ్ వద్ద 8.4, వెస్ట్ మారేడ్‌పల్లిలో 8.1, మధుసూదన్‌నగర్‌లో 6.9, ఉప్పల్ రాజీవ్‌నగర్‌లో 5.9, వరంగల్ జిల్లాలోని పైడిపల్లిలో 6.4, జనగామ జిల్లాలోని అబ్దుల్ నాగారంలో 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
నిజామాబాద్‌లో అత్యధికం.. కుంభవృష్టి వర్షాలతో 2022 జులైలో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదయింది. జిల్లాలవారీగా చూస్తే.. నిజామాబాద్‌లో అత్యధికంగా 300 శాతం అదనపు వర్షపాతం నమోదయింది. ఈ జిల్లా సాధారణ వర్షపాతం 252.6 మిల్లీమీటర్ల(మి.మీ.)కు 1011.2 మి.మీ, జగిత్యాలలో 249కి 895.5 మి.మీ.లు కురిసింది. రాష్ట్ర సగటు వర్షపాతం 281.5కి గాను 535.5 మి.మీ.లు కురిసింది. జులైలో ఈ స్థాయి వర్షాలు పడటం అరుదని వాతావరణశాఖ వర్గాలు వివరించాయి. మూడు రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 5.1 డిగ్రీలు అదనంగా పెరగడంతో ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం అత్యధికంగా సిరిపురం(ఖమ్మం జిల్లా)లో 39, ఆదివారం రాత్రి అత్యల్పంగా భద్రాచలంలో 27.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
పెరిగిన విద్యుత్ డిమాండ్.. ఉక్కపోతలతో పాటు వ్యవసాయ పనులు జోరందుకోవడంతో రాష్ట్రంలో కరెంటు వినియోగం గణనీయంగా పెరిగింది. గత నెల 29న అత్యధికంగా 12,468 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. రోజూవారీ వినియోగం ఆదివారం(జులై 31) రికార్డుస్థాయిలో 217.92 మిలియన్ యూనిట్లు(ఎంయూ) నమోదైంది. జులై 10న కరెంటు వినియోగం కేవలం 123 ఎంయూలుంటే నెలాఖరుకల్లా మరో 94.92 ఎంయూలు అదనంగా పెరగడం గమనార్హం.
ఉక్కపోతలతో ఇళ్లతో పాటు పరిశ్రమలు, వ్యవసాయానికి కరెంటు వినియోగం అధికంగా ఉండటం వల్ల డిమాండ్ అనూహ్యంగా పెరుగుతోంది. గతేడాది(2021) జులైలో 31న గరిష్ఠంగా 11,512 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవగా ఈ ఏడాది జులైలో అంతకన్నా 956 మెగావాట్ల వరకూ డిమాండ్ అదనంగా పెరిగింది. కృష్ణానదికి వరదలు రావడంతో జల విద్యుదుత్పత్తి జులై 31న 29.11 ఎంయూలుకు పెంచారు. జలవిద్యుదుత్పత్తి పెంచడం వల్ల విద్యుత్ డిమాండుకు రెక్కలొచ్చినా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.