Rain in Telangana Today : నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలో వాన మొదలైంది. మొదటి రోజే వరణుడు దంచికొట్టాడు. ఇవాళ తెల్లవారుజాము నుంచే మళ్లీ షురూ చేశాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో రాష్ట్రమంతా ఒక్కసారిగా చల్లబడింది. ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు ఇబ్బందులు పడుతున్నారు.
Telangana Rain Updates : మరోవైపు నైరుతి రుతుపవనాలు బుధ, గురు వారాల్లో తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో విస్తరించడానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురు వారాల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన సమయంలో సోమవారం ఉదయం 8 నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో భారీవర్షాలు కురిశాయని చెప్పింది.
రాష్ట్రంలో అత్యధికంగా భాగ్యనగర శివారులోని మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ ప్రాంతంలో 9.1 సెంటీమీటర్లు, చర్లపల్లిలో 9, బిచ్కుంద (కామారెడ్డి జిల్లా)లో 8.3, రవీంద్రనగర్ (కుమురం భీం)లో 7.7, ఖమ్మంలో 7.6, బాచుపల్లిలో 7.1, కీసరలో 6.2, సింగపూర్ టౌన్‌షిప్ వద్ద 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు లేని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. మంగళవారం పగలు అత్యధికంగా ఆళ్లపల్లి(భద్రాద్రి జిల్లా)లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.