Telangana Rains Today: బంగ్లాదేశ్ నుంచి ఝార్ఖండ్ వరకు 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. దీని ప్రభావంతో ఝార్ఖండ్‌పై ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. పశ్చిమ, నైరుతి భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులోకి గాలులు వీస్తున్నాయంది. వీటి ప్రభావంతో జంటనగరాల్లో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. వర్షం వల్ల ఇవాళ ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.
మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి అక్కడక్కడ ఒక మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భద్రాద్రిలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో బొగ్గు గనుల్లో వరద నీరు చేరింది. దాంతో టేకులపల్లి పరిధిలోని కోయగూడెం గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జుక్కల్, నిజాంసాగర్ మండలాల్లో భారీ వర్షం పడుతుండడంతో.. శేర్ఖాన్పల్లి వాగు పొంగి పొర్లుతుంది. భారీ వర్షం కారణంగా సిద్ధాపూర్ సమీపంలో రహదారిపై లారీ దిగబడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంచిర్యాల జిల్లాలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్, కళ్యాణి ఖని ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు వెలికి తీసే యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మోటార్ల సాయంతో వరద నీటిని బయటికి పంపుతున్నారు.. గనిలోని రోడ్లన్నీ బురదమయం కావడంతో మట్టి వెలికితీత పనులు సైతం నిలిచిపోయాయి. మంచిర్యాల జిల్లాలోని సింగరేణి బొగ్గు ఉపరితల గనుల్లో 23 వేల టన్నుల వరకు బొగ్గుకు అంతరాయంతో... రోజుకు 6 కోట్ల 90 లక్షల నష్టం వాటిల్లుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా మునిగాలవీడు(మహబూబాబాద్ జిల్లా), మంగళపల్లె(రంగారెడ్డి)ల్లో 5.5, పుల్కల్(సంగారెడ్డి)లో 5.3, పాత రాజంపేట(కామారెడ్డి)లో 4.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గి వాతావరణం చల్లబడింది.
ఇవీ చదవండి: