Telangana Rains Today : మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. మరోవైపు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది.
ఆదివారం మధ్యాహ్నం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా నిజాంబాద్(రాజన్న జిల్లా)లో 4.6, కోహెడ(సిద్దిపేట)లో 4, మల్యాల(కరీంనగర్)లో 4, టేక్మాలు(మెదక్)లో 4, అశ్వాపురం(భద్రాద్రి)లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం అత్యధికంగా కారేపల్లి(ఖమ్మం)లో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వర్షాలతో ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.
జంటనగరాల్లో ఆదివారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో భారీగా వాన పడుతోంది. శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్, ఎల్బీనగర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, శేరిలింగంపల్లి, గోల్కొండ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిశాయి. వర్షం వల్ల ఇవాళ ఉదయాన్నే కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు.