కరోనా నివారణలో భాగంగా ప్రభుత్వం తలపెట్టిన కర్ఫ్యూ సమయంలో నిత్యవసర వస్తువులను అధిక ధరలకు అమ్ముతున్నారన్న సమాచారంతో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో రాచకొండ ఎస్వోటీ పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడులలో సుమారు రూ.30 లక్షల విలువైన నిత్యవసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
దుకాణ యజమానిపై కేసు నమోదు
ఉగాది పండుగ, కర్ఫ్యూ నేపథ్యంలో అధిక ధరలకు సరుకులు అమ్ముతున్న జై ప్రకాష్ ట్రేడింగ్ కంపెనీ మీద ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. 30 లక్షల విలువ చేసే... 50కేజీల పంచదార బస్తాలు 300, 50కేజీల మైదా పిండి బస్తాలు 37, 50 కేజీల బొంబాయి రవ్వ బస్తాలు 40, 50 కేజీల గోధుమ పిండి బస్తాలు 39 స్వాధీనం చేసుకొని దుకాణం యజమాని బొల్లు శ్రీనివాస్ మీద కేసు నమోదు చేసి స్థానిక పోలీసులకు కేసు అప్పగించారు.
సమాచారం ఇవ్వండి...
కర్ఫ్యూ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎక్కడ నిత్యవసర వస్తువులు అధిక ధరలకు అమ్మినా దాడులు చేస్తామని, ప్రజలు సహకరించి సమాచారం అందించాలని రాచకొండ ఎస్వోటీ అదనపు డీసీపీ సురేందర్ రెడ్డి తెలిపారు.