రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నదీ పరివాహక ప్రాంతాల్లో ఇసుక రీచ్‌లు ఏర్పాటు చేసి విక్రయాలు చేపడుతోంది. ఇసుక కావలసిన వాళ్లు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని డబ్బు చెల్లిస్తే నేరుగా ఇసుక ఇంటికి చేరుతుంది. రీచ్‌ల వద్ద కొంతమంది అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండికొడుతున్నారు. ఈ తరహా వ్యవహారాన్ని రాచకొండ పోలీసులు ఛేదించారు.
అధిక లాభాల కోసమే..
ములుగు జిల్లా గోదావరి పరివాహక ప్రాంతమైన మల్యాల శివారులో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఇసుక రీచ్‌ను కిరణ్ కుమార్ అనే వ్యక్తికి అప్పగించింది. ఆన్‌లైన్ ద్వారా వచ్చే అనుమతి పత్రాల ప్రకారం యంత్రాలతో ఇసుకను లారీల్లో నింపి పంపడం గుత్తేదారు బాధ్యత.
దీనికి గాను ఒక్కో లారీకి ఆయనకు రూ. 2వేలు చెల్లిస్తారు. కిరణ్ కుమార్‌కు ఆశించిన లాభాలు రావడం లేదని అక్రమ సంపాదనపై కన్నేశాడు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పొరుగు సేవల సిబ్బంది సహకారంతో అక్రమాలకు పాల్పడుతున్నాడు.
అలా బయట పడింది
గత నెల 10న ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇసుక లారీని పోలీసులు పట్టుకున్నారు. అనుమతి పత్రాలు పరిశీలించగా నకిలీ అని తేలింది. డ్రైవర్‌ను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు. లారీ యజమాని మధుకర్ పరారై నేరుగా న్యాయస్థానానికి వెళ్లి ముందస్తు బెయిలు పొందాడు.
ఈ నెల 9న ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చిన మధుకర్‌ను నకిలీ అనుమతి పత్రాల గురించి ప్రశ్నించారు. దీంతో గుత్తేదారు కిరణ్‌కుమార్ వ్యవహారం బయటపడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ఇసుక రవాణా కోసం అనుమతి పత్రాలు ఏ విధంగా వస్తాయో అలాంటి పత్రాలనే కిరణ్ కుమార్ తన స్నేహితుడు నవీన్ సహకారంతో సృష్టించుకున్నాడు. ఇసుక రీచ్ వద్ద ఖనిజాభివృద్ధి సంస్థ తరపున పని చేస్తున్న పొరుగు సేవల సిబ్బందికి డబ్బు ఆశ చూపి కిరణ్ కుమార్ తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు తేలింది.
ప్రభుత్వానికి కోటి టోపీ
లారీలో 40 టన్నుల ఇసుక నింపి యజమాని నుంచి రూ. 25 వేల దాకా వసూలు చేస్తున్నాడు. ఇందులో పొరుగు సేవల సిబ్బందికి, సహకరిస్తున్న వాళ్లకు లారీపై రూ. పదివేల దాకా ఖర్చు చేస్తున్నాడు.
మిగతా రూ. 15వేలు తన జేబులో వేసుకున్నాడు. ఇలా రోజుకు 30 లారీల దాకా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. మార్చిలో మొదలైన దందా ఇప్పటి వరకు కొనసాగింది. 500కు పైగా లారీలలో ఇసుక రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఒక్కో లారీ వల్ల రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు రూ. 10 నుంచి రూ. 15వేల వరకు ఆదాయం వస్తుంది.
మాల్యాల ఇసుక రీచ్ వల్ల దాదాపు కోటి రూపాయలు నష్టం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 జిల్లాల్లో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. మిగతా ఇసుక రీచ్‌ను ఈ తరహా ఇసుక మాఫియా ఉన్నట్లు రాచకొండ పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థతో పాటు ప్రభుత్వానికి అక్రమాలపై నివేదిక ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: కోవాక్జిన్ క్లినికల్ ట్రయల్స్ తొలిదశ విజయవంతం