రాష్ట్రంలో విధించిన లాక్డౌన్ వల్ల ఎంతో మంది పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు ఉండటానికి నివాసం లేక వీధిన పడుతుంటే.. మరికొందరు ఒకపూట తిండికి కూడా నోచుకోని దుస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. ఇలాంటి వారందరికి మేమున్నామంటూ కడుపు నింపుతున్నాయి కొన్ని స్వచ్ఛంద సంస్థలు. అలాంటి వాటిలో ఒకటే పర్పస్ ఛారిటబుల్ ట్రస్ట్. ఈ ట్రస్ట్ దాతల సాయంతో లాక్డౌన్లో ఎంతో మంది పేదల ఆకలి తీరుస్తోంది.
ఈరోజు దాదాపు 400 మందికి ఈ ట్రస్ట్ భోజనం ప్యాకెట్లు పంపిణీ చేసింది. ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయస్సు గల 40 మంది బాలికలున్న లల్లన్న ఫౌండేషన్‌కు రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేసింది. దాతలు తాండవ కృష్ణ, బాబీ, పల్లిక నరేశ్‌ల సాయంతో వీరందరికి చేయూతనందించినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకుడు బ్లెస్సో శ్యామ్యూల్ తెలిపారు.