స్వచ్ఛ, ఆరోగ్య తెలంగాణ ధ్యేయంగా రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. అందులో సగం మహిళల కోసం నిర్మించాలని నిర్ణయించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి టాయిలెట్లను పూర్తిచేయాలని పురపాలకశాఖా మంత్రి కేటీఆర్ గడువు విధించారు.
అందులో భాగంగా పట్టణాల్లో ఇప్పటికే ఉన్న టాయిలెట్ల వివరాలు సేకరించి కొత్తగా నిర్మించాల్సిన వాటిని గుర్తించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 7200 పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగతా 139 నగర, పురపాలికల్లో 7693 పబ్లిక్ టాయిలెట్లు అవసరమని గుర్తించారు. అందులో ఇప్పటికే 4798 ఉండగా... మరో 4048 నిర్మించాల్సి ఉంది. అందులో ఇప్పటి వరకు 3000 పబ్లిక్ టాయిలెట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగతా 800 కూడా నెలాఖరు వరకు పూర్తవుతాయని అంటున్నారు.
మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా పదివేలకు పైగా పబ్లిక్ టాయిలెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీంతో మొత్తంగా రాష్ట్రంలోని పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య 18000కు చేరుకుంటుందని పురపాలక శాఖ అంటోంది. అటు అక్టోబర్ రెండో తేదీన 400 మొబైల్ టాయిలెట్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.